
క్లార్క్ పునరాగమనానికి వాయు'గండం'
ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పునరాగమనానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారనుంది.
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ పునరాగమనానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారనుంది. ప్రస్తుతం జరుగుతున్న 11వ ప్రపంచకప్ లో ఆడేందుకు క్లార్క్ సిద్ధమయ్యాడు. బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో శనివారం బంగ్లాదేశ్ తో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా తలపడనుంది. గాయం నుంచి కోలుకున్న క్లార్క్ ఈ మ్యాచ్ తో వరల్డ్ కప్ బరిలోకి దిగాలని భావించాడు. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారే అవకాశముంది.
వాయుగుండం కారణంగా ఇక్కడ 30 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం 80 శాతముందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణంతో క్లార్క్ పునరాగమనంపై ప్రతిష్టంభన నెలకొంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకుంటే ఈనెల 28న న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ వరకు క్లార్క్ వేచిచూడాల్సి వుంటుంది.