సూపర్ స్టెయిన్
ఐదు వికెట్లతో రెచ్చిపోయిన పేసర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 283/9
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు
గాలే: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ (5/50) పదునైన బంతులకు శ్రీలంక బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఏమాత్రం బౌలింగ్‌కు అనుకూలించని ఫ్లాట్ ట్రాక్‌పై ఈ టాప్ పేసర్ చెలరేగడంతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంక 100 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 283 పరుగులు చేసింది. ప్రస్తుతం మాథ్యూస్ సేన 172 పరుగులు వెనుకబడి ఉండగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి టెస్టుపై సఫారీ జట్టు పట్టు సాధించినట్టయ్యింది. 2007లో తన చివరి టెస్టు ఆడిన ఓపెనర్ ఉపుల్ తరంగ (155 బంతుల్లో 83; 14 ఫోర్లు; 1 సిక్స్) సత్తా చాటుకోగా మిడిలార్డర్‌లో కెప్టెన్ మాథ్యూస్ (182 బంతుల్లో 89; 14 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు.
అంతకుముందు శుక్రవారం లంక 30/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించగా మరో తొమ్మిది పరుగులకే స్టెయిన్ లంక వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. వరుసగా ఏడు ఇన్నింగ్స్‌ల్లో అర్ధ సెంచరీలతో ఊపు మీదున్న సంగక్కర (34 బంతుల్లో 24; 3 ఫోర్లు) కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఎనిమిదో వికెట్‌కు మాథ్యూస్, రంగనా హెరాత్ (44 బంతుల్లో 12 బ్యాటింగ్; 2 ఫోర్లు) కలిసి కీలకమైన 71 పరుగులు జోడించారు. స్టెయిన్ ఓ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 23వ సారి. మోర్కెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.