
ఇక నిరీక్షణ ముగిసింది!
కేప్టౌన్: దాదాపు ఏడాది కాలంగా క్రికెట్ కు దూరమైన దక్షిణాఫ్రికా స్పీడ్గన్ డేల్ స్టెయిన్ పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. భుజం గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టెయిన్.. గతేడాది నవంబర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో చివరిసారి కనిపించాడు. అతని భుజానికి శస్త్ర చికిత్స అనంతరం సుదీర్ఘమైన విశ్రాంతి తీసుకున్న స్టెయిన్ తిరిగి బరిలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పునరాగమనానికి సంబంధించి 'ఇక నిరీక్షణ ముగిసింది' అని పోస్ట్ చేశాడు.
ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-1 తో దక్షిణాఫ్రికా కోల్పోయింది. ప్రధానంగా స్టెయిన్ దూరం కావడంతో పాటు, మరో ఇద్దరు పేసర్లు ఫిలిండర్, క్రిస్ మోరిస్ లను గాయాలు వేధించడంతో ఇంగ్లండ్ చేతిలో సఫారీలకు ఘోర పరాభవం ఎదురైంది. త్వరలో బంగ్లాదేశ్ తో జరిగే టెస్టులకు స్టెయిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.