WC 2022 Dale Steyn: Rabada Nortje Can Help South Africa Win Trophy - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ‘వాళ్లిద్దరు అద్భుతం.. ఈసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీ సౌతాఫ్రికాదే!’.. భారత్‌ నుంచి ఒక్కరికీ చోటు లేదు!

Published Sat, Oct 29 2022 12:55 PM | Last Updated on Sat, Oct 29 2022 1:32 PM

WC 2022 Dale Steyn: Rabada Nortje Can Help South Africa Win Trophy - Sakshi

PC: ICC

T20 World Cup 2022టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో తొలి మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టింది. తద్వారా నెట్‌ రన్‌రేటు భారీగా పెంచుకుని గ్రూప్‌-2లో గట్టి పోటీదారుగా నిలిచింది. కాగా వర్షం కారణంగా హోబర్ట్‌లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఫలితం తేలకుండా పోవడంతో ప్రొటిస్‌కు ఒకే ఒక్క పాయింట్‌ వచ్చిన విషయం తెలిసిందే.

గెలిచే మ్యాచ్‌లో వరుణుడి రూపంలో ఇలా దురదృష్టం వెక్కిరించడంతో ఉసూరుమంది. అయితే, ఆ బెంగ తీరేలా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 104 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్‌లో రిలీ రోసో అద్భుత సెంచరీ(109)తో మెరవగా.. 205 పరుగుల భారీ స్కోరు చేసింది సౌతాఫ్రికా.

అద్భుతం చేసిన బౌలర్లు
ఇక బౌలర్లు కగిసో రబడ ఒకటి, కేశవ్‌ మహరాజ్‌​​ ఒకటి, తబ్రేజ్‌ షంసీ 3 వికెట్లు తీశారు. ఇక అన్రిచ్‌ నోర్జే 3.3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు కూల్చి బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారీ తేడాతో గెలిచిన ప్రొటిస్‌ జట్టు రెండు మ్యాచ్‌లు ముగిసే సరికి మూడు పాయింట్లు, నెట్‌రన్‌ రేటు 5.200తో గ్రూప్‌-2లో ప్రస్తుతం టీమిండియా తర్వాతి స్థానం(2)లో నిలిచింది.

ఈసారి విజేతగా సౌతాఫ్రికా
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ పేసర్‌, కామెంటేటర్‌ డేల్‌ స్టెయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై తమ బౌలర్లు అద్భుతం చేయగలరని.. ప్రొటిస్‌ తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాడు.

ఈ మేరకు ఐసీసీ వెబ్‌సైట్‌తో స్టెయిన్‌ మాట్లాడుతూ.. ‘‘సౌతాఫ్రికా బౌలింగ్‌ అటాక్‌కు కగిసో రబడ నాయకుడు. అతడికి తోడుగా అన్రిచ్‌ నోర్జే కూడా ఉన్నాడు. ఈ ఫాస్ట్‌బౌలర్ల జోడీ అద్భుతంగా రాణించగలదు. వీళ్లిద్దరూ కలిసి ఈసారి సౌతాఫ్రికాకు వరల్డ్‌కప్‌ అందించగలరని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు.

నా టాప్‌-5 బౌలర్లు వీరే
‘‘వాళ్ల పేస్‌లో వైవిధ్యం ఉంది. మెరుగైన నైపుణ్యాలు కలిగి ఉన్న బౌలర్లు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఎక్స్‌ట్రా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై రబడ రెచ్చిపోవడం ఖాయం. నోర్జే కూడా తక్కువేమీ కాదు’’ అంటూ ప్రొటిస్‌ను గెలిపించగల సత్తా వీరికి ఉందని డేల్‌ స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు. ఇక గ్రూప్‌-1లోని ఇంగ్లండ్‌ జట్టులో మార్క్‌ వుడ్‌ తన ఫేవరెట్‌ అన్న ఈ స్పీడ్‌స్టర్‌.. యార్కర్లు, బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో అతడు దిట్ట అని పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌ ఈ టోర్నీలో గనుక ముందుకు వెళ్తే అందులో మార్క్‌దే కీలక పాత్ర అని చెప్పవచ్చని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ప్రస్తుత వరల్డ్‌కప్‌ టోర్నీలో తన టాప్‌-5 బౌలర్ల పేర్లను స్టెయిన్‌ వెల్లడించాడు. కగిసో రబడ, అన్రిచ్‌ నోర్జే, మార్క్‌ వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, షాహిన్‌ ఆఫ్రిదిలకు ఈ లిస్టులో స్థానమిచ్చాడు. ఇక స్టెయిన్‌ ఈ జాబితాలో ఒక్క టీమిండియా పేసర్‌ కూడా లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఒక్కసారి కూడా ఐసీసీ ట్రోఫీ గెలవని జట్టుగా సౌతాఫ్రికాకు అపవాదు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టెయిన్‌ వ్యాఖ్యలపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.  ‘‘కనీసం ఈసారైనా టైటిల్‌ గెలిచి చోకర్స్‌ ట్యాగ్‌ను తొలగించుకోండి’’ అంటూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.

చదవండి: ఏ నిమిషానికి ఏమి జరుగునో! రిజర్వ్‌ డే ఉన్నా.. 667లో ఒక్కటే రద్దైనా.. ఫైనల్‌ ‘బెంగ’!
T20 WC 2022: 'అతడు జట్టులో లేడు.. అందుకే పాకిస్తాన్‌కు ఈ పరిస్థితి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement