కరాచీ: ఐపీఎల్ ఆరంభమైన నాటినుంచి గత సీజన్ వరకు ఆడిన దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ లీగ్‌కు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని, అక్కడ అసలు ఆట తెర వెనక్కి వెళ్లిపోతుందని అతను అన్నాడు. ఈ లీగ్‌లో హైదరాబాద్, బెంగళూరు, గుజరాత్ జట్ల తరఫున 95 మ్యాచ్‌లు ఆడిన స్టెయిన్ 97 వికెట్లు తీశాడు. కనీసం 50కు పైగా వికెట్లు తీసిన బౌలర్లలో అతి తక్కువ ఎకానమీ (6.91) ఉన్న పేసర్ కూడా ఇతనే. గత రెండు సీజన్లుగా పెద్దగా రాణించలేకపోయిన స్టెయిన్ ఈసారి ముందే తప్పుకున్నాడు. ప్రస్తుతం అతను పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోలుస్తూ స్టెయిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ఐపీఎల్‌లో ఎప్పుడు చూసినా భారీ జట్లు, పెద్ద ఆటగాళ్లు, ఎవరికెంత ఇస్తున్నారు అనే దానిపైనే చర్చ సాగుతుంది. అలాంటి స్థితిలో క్రికెట్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుంది. అందుకే ఒక ఆటగాడిగా ఐపీఎల్‌తో పోలిస్తే నాకు పీఎస్‌ఎల్, లంక లీగ్‌లలో ఆడటం ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఈ లీగ్‌లలో ఆటపై ఎక్కువగా దృష్టి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన రెండు రోజుల్లో నన్ను కలిసిన వారంతా క్రికెట్ గురించే చర్చించారు. అదే ఐపీఎల్‌లో నీకు ఎంత మొత్తం వస్తోంది అనేది మాట్లాడతారు. అందుకే ఈసారి ఐపీఎల్‌ను కాదని నాకు నచ్చిన చోట ఆడాలని నిర్ణయించుకున్నా. పైగా ఐపీఎల్ చాలా ఎక్కువ రోజులు సాగుతుంది. నాకంటూ కొంత సమయం కూడా కావాలి’ అని స్టెయిన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ అంతా డబ్బే.. ఆట లేదంటున్న స్టార్ పేసర్
Published Wed, Mar 3 2021 3:29 AM | Last Updated on Wed, Mar 3 2021 9:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment