హనీమూన్ మానుకుని.. హీరో అయ్యాడు!
హనీమూన్ మానుకుని.. హీరో అయ్యాడు!
Published Sat, Aug 26 2017 8:18 AM | Last Updated on Sun, Sep 17 2017 5:58 PM
ప్రస్తుతం శ్రీలంకతో పాటు భారత క్రికెట్ అభిమానులు చర్చించుకుంటోన్న లంక యువ సంచలనం అఖిల ధనంజయ. సరిగ్గా 24 ఏళ్లు కూడా లేని స్పిన్నర్ గురువారం జరిగిన రెండో వన్డేలో భారత స్టార్ ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే మరో విషయంలోనూ అతడిని లంక క్రికెటర్లు, ప్రజలు గుర్తుంచుకుంటారనడంలో సందేహమే లేదు. హనీమూన్ కు వెళ్లాల్సిన స్పిన్నర్ పెళ్లి జరిగిన రోజు రాత్రే లంక జట్టుతో కలిశాడు.
అదేనండీ.. రెండో వన్డేకు ముందురోజు (బుధవారం) తన సొంతూరు మోరత్వాలో చిన్ననాటి స్నేహితురాలు నెతాలి టెక్షిణిని వివాహం చేసుకున్నాడు. అందరిలాగే తాను మరుసటి రోజు తన భార్యతో కలిసి హనీమూన్‌కు వెళ్లాలి, కానీ లంక టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి పిలుపు రావడంతో రాత్రికి రాత్రే క్యాండీలోని హోటల్‌లో బసచేస్తున్న లంక జట్టుతో చేరాడు. జట్టు కోసం వ్యక్తిగత విషయాన్ని పక్కనపెట్టిన ధనుంజయ పటిష్టస్థితిలో ఉన్న సమయంలో టీమిండియాను దారుణంగా దెబ్బతీశాడు.
108/0 తో ఉన్న భారత్ ధనుంజయ బౌలింగ్ దాడితో 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయింది. కెరీర్ ల్ నాల్గో వన్డే ఆడుతున్నా వరుస విరామాల్లో వికెట్లు తీసి (6/54) టీమిండియాకు పెద్ద పరీక్ష పెట్టాడు. అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాణించడంతో పాటు కెరీర్ లో తొలి వన్డే హాఫ్ సెంచరీతో భువనేశ్వర్ కదం తొక్కడంతో భారత్ విజయం సాధించినా.. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న ధనంజయనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
నెతాలి వెరీ వెరీ హ్యాపీ..
తన భర్త ఆటను ఆస్వాదించేందుకు భార్య నెతాలి పల్లెకెలె గ్యాలరీలో ప్రత్యక్షమైంది. భర్త ఆటను ప్రత్యక్షంగా చూసి ఎంజాయ్ చేసింది నెతాలి. పటిష్ట భారత జట్టు బ్యాట్స్ మెన్లపై బౌలింగ్ దాడిలో ధనంజయ విజయం సాధించడాన్ని వీక్షించింది. లంక ఓటమి ఆమెను నిరాశ పరిచినా.. తన భర్త వన్ మ్యాన్ షో చేయడం కొత్త పెళ్లికూతురు జీవితంలో మరపురాని ఘటనగా నిలిచిపోతుంది.
Advertisement
Advertisement