ఢిల్లీ బెంబేలు..
►67 పరుగులకే డేర్‌డెవిల్స్ ఆలౌట్
►నిప్పులు చెరిగిన సందీప్
►పంజాబ్ చేతిలో పది వికెట్లతో ఢిల్లీ పరాజయం
►గప్టిల్ మెరుపులు
మొహాలీ: 67 పరుగులు... అత్యధిక వ్యక్తిగత స్కోరు కాదు! ఢిల్లీ డేర్‌డెవిల్స్ అందరి స్కోరు!! ఫలితం చెప్పనక్కర్లేదు... పంజాబ్ చేతిలో పరాభవం. లీగ్‌లో వరుసగా ఐదో పరాజయం. ప్లే–ఆఫ్ ఆశలకు దూరమయ్యేందుకు... బెంగళూరు పంచన చేరేందుకు దగ్గరవుతోంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో నిర్లక్ష్యాన్ని నిండుగా చూపించింది. 10 వికెట్ల పరాజయాన్ని చక్కగా చవిచూసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. తర్వాత సునాయాస లక్ష్యాన్ని పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. తన టి20 కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ (4/20)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఇలా టపాకట్టేశారు...
ఢిల్లీ పతనం ఆరో బంతితోనే మొదలైంది. పిచ్ పరిస్థితుల్ని చక్కగా ఆకళింపు చేసుకున్న కింగ్స్ బౌలర్ సందీప్ శర్మ నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌తోనే ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మొదట బిల్లింగ్స్ (0)ను, ఆ తర్వాత తన రెండో ఓవర్లో సామ్సన్ (5), మూడో ఓవర్లో శ్రేయస్ అయ్యర్ (6)ను పెవిలియన్ పంపాడు. మరోవైపు అక్షర్ పటేల్ (2/22) కూడా ఓ చేయివేయడంతో ఢిల్లీ 33 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. కరుణ్ నాయర్ (11), మోరిస్ (2) అక్షర్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వికెట్ల ఉత్పాతంలో వరుణ్ ఆరోన్ (2/3) కూడా జతకలవడంతో ఢిల్లీకి పరుగులు రావడమే గగనమైంది. ఏ ఒక్కరూ 20 పరుగులు చేయలేకపోయారు. కోరె అండర్సన్ (18)దే అత్యధిక స్కోరు... వెరసి ఢిల్లీ 67 ఆలౌట్.
గప్టిల్ ముగించాడు...
అలవోక లక్ష్యాన్ని ఛేదించేదుకు బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, హషీమ్ ఆమ్లా అజేయంగా ముగించారు. జట్టుకు 10 వికెట్ల ఘనవిజయాన్ని అందించారు. ముఖ్యంగా గప్టిల్ (27 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇతనికి అండగా హషీమ్ ఆమ్లా (20 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) సహాయపాత్ర పోషించాడు. దీంతో కేవలం 7.5 ఓవర్లలోనే పంజాబ్ లక్ష్యాన్ని చేరుకుంది. ఈ సీజన్‌లో కింగ్స్‌కిది నాలుగో విజయం.