
డారెన్ స్యామీ
ఆక్లాండ్: న్యూజిలాండ్ పర్యటనలో వెస్టిండీస్ జట్టుకు తొలి విజయం దక్కింది. ఇది వరకే టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పర్యాటక జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. ఆల్‌రౌండర్ డారెన్ స్యామీ (27 బంతుల్లో 43 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్స్‌లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో కివీస్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో విండీస్ రెండు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 42.1 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మెకల్లమ్ (57 బంతుల్లో 51; 5 ఫోర్లు; 1 సిక్స్), నాథన్ మెకల్లమ్ (64 బంతుల్లో 47; 2 ఫోర్లు; 3 సిక్స్‌లు) మాత్రమే రాణించారు.
దాదాపు రెండేళ్ల విరామానంతరం జట్టులోకి వచ్చిన జెస్సీ రైడర్ పరుగులేమీ చే యకుండా నిరాశపరిచాడు. విండీస్ బౌలర్ల ధాటికి ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. డ్వేన్ బ్రేవోకు నాలుగు వికెట్లు, హోల్డర్, రాంపాల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ తడబడినప్పటికీ 27.3 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసి నెగ్గింది. 96 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న విండీస్‌ను చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్యామీ ఆదుకున్నాడు. ఎదురుదాడే లక్ష్యంగా బ్యాట్‌కు పనిచెప్పడంతో పరుగులు వేగంగా వచ్చాయి. బౌండరీలతో విరుచుకుపడి జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. మెక్లీంగన్‌కు ఐదు వికెట్లు, మిల్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండో వన్డే 29న జరుగుతుంది.