బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైంది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు మ్యాచ్ ఆరంభమైంది. రెండో రోజు ఆటలో ‘భారీ’ సవాల్ విసిరిన ఆస్ట్రేలియా జోరుకు జవాబు ఇచ్చే దిశగా భారత్ మూడో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ 26.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 75 పరుగులతో కొనసాగుతోంది. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (82 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 35 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 497 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి.
అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.