
బెంగళూరు: టీమిండియాతో జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్‌ను సమం చేసింది. టీమిండియా నిర్దేశించిన 135 పరుగుల టార్గెట్‌ను సఫారీలు వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించారు. కేవలం ఓపెనర్ రీజా హెండ్రిక్స్(28) వికెట్‌ను మాత్రమే కోల్పోయిన దక్షిణాఫ్రికా.. 16.5 ఓవర్లలో విజయ భేరీ మోగించింది. కెప్టెన్ క్వింటాన్ డీకాక్(79 నాటౌట్; 52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా ఆడి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా బావుమా(27 నాటౌట్) ఆకట్టుకున్నాడు.
కాగా, డీకాక్ ఒక అరుదైన జాబితాలో చేరిపోయాడు. అంతర్జాతీయ టీ20 కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాభైకి పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో డీకాక్ 52 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. టీ20 కెప్టెన్లగా నియమితులై వరుసగా యాభైకి పరుగులు నమోదు చేసిన క్రికెటర్ల జాబితాలో పాల్ స్టిర్లింగ్(ఐర్లాండ్), నవనీత్ సింగ్(కెనడా)ల తర్వాత స్థానాన్ని డీకాక్ ఆక్రమించాడు. ఇదిలా ఉంచితే. అంతర్జాతీయ టీ20ల్లో డీకాక్ వెయ్యి పరుగుల్ని సాధించడం మరో విశేషం. ప్రస్తుతం డీకాక్ 1018 పరుగులతో ఉన్నాడు. అయితే అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్ల జాబితాలో కుమార సంగక్కరా(శ్రీలంక)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. డీకాక్ తన 38 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. ఈ జాబితాలో బ్రెండన్ మెకల్లమ్(31), మహ్మద్ షెహ్‌జాద్(37)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
రెండో ఓపెనింగ్ జంటగా..
టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రెండో జంటగా హెండ్రిక్స్-డీకాక్‌ల జోడి నిలిచింది. నిన్నటి మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 76 పరుగుల్ని డీకాక్-హెండ్రిక్స్‌లు నమోదు చేశారు. అంతకుముందు ఏబీ డివిలియర్స్-హషీమ్ ఆమ్లాలు జోడి 77 పరుగులు చేసింది. 2015లో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్-ఆమ్లాలు ఈ ఫీట్‌ను సాధించారు. ఇక దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో కెప్టెన్‌గా డీకాక్ గుర్తింపు సాధించాడు. గతంలో డుప్లెసిస్ 85 పరుగులు సాధించాడు. ఇదే దక్షిణాఫ్రికా టీ20 కెప్టెన్‌గా అత్యధిక పరుగుల రికార్డు.