వైకల్యాన్ని జయించాడు...
టెన్నిస్‌లో రాణిస్తున్న బధిర క్రీడాకారుడు సాయిచందన్
- పారాలింపిక్స్ లక్ష్యంగా సాధన
- స్పాన్సర్‌షిప్ కోసం ఎదురుచూపు
సాక్షి, హైదరాబాద్: శారీరక వైకల్యం ఆ కుర్రాడి పట్టుదలను ఆపలేకపోయింది. తనలో లోపం ఉన్నా తానూ అందరిలాగే నచ్చిన రంగంలో సత్తా చాటాలనుకున్నాడు. తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవాలని క్రీడలను ఎంచుకున్నాడు. ఇప్పుడు జాతీయస్థాయిలో రాణించి తన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడు. అతడే యువ టెన్నిస్ ప్లేయర్ లింగాపురం సాయిచందన్. పుట్టుకతోనే మూగ, చెవిటివాడు అయినప్పటికీ సాధనతో టెన్నిస్ క్రీడలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న 15 ఏళ్ల ఈ కుర్రాడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. అతని ఆశయం నెరవేర్చేందుకు అన్ని కష్టనష్టాలకు ఓర్చి తల్లిదండ్రులు కూడా అండగా నిలుస్తున్నారు.
ఐదేళ్ల వయసు నుంచి...
సాయిచందన్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. జన్మత బధిరుడు. మూడేళ్ల వయసులో స్పీచ్ థెరపీ చేయించినా పెద్దగా మెరుగుదల కనిపించలేదు. స్థానికంగా కొంత మంది టెన్నిస్ ఆడటాన్ని ఆసక్తిగా గమనించిన అతను దానిపై మక్కువ చూపించాడు. హోమియోపతి వైద్యుడైన తండ్రి నరసింహేశ్వరన్ కొడుకును నిరాశపర్చకుండా ఐదేళ్ల వయసులో రాకెట్ చేతికిచ్చి ప్రోత్సహించారు. అక్కడి నంది అకాడమీలో కోచ్ మేఘ్‌నాథ్, సాయికి శిక్షణ ఇచ్చారు. కొడుకుకు తోడుగా ఉండేందుకు తల్లి కృష్ణప్రియ కూడా టెన్నిస్ పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. సైగలే తప్ప మాట్లాడలేని కుమారుడికి టెన్నిస్‌లోనూ ఆమె సహకరించాల్సి వచ్చింది. కోచ్ చెప్పిన మాటలను ఆమె కొడుకుకు సైగలతో చెప్పడం, అతని సందేహాలకు కోచ్‌నుంచి సమాధానం తీసుకొని మళ్లీ అబ్బాయికి వివరించడం చేశారు. ఇలా దాదాపు ఐదేళ్ల శిక్షణ అనంతరం తొలిసారి అతను ఓపెన్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సెమీఫైనల్‌కు చేరాడు. జాతీయ స్కూల్ గేమ్స్‌లో నిలకడగా విజయాలు సాధించిన సాయిచందన్...అండర్-12, అండర్-14 వయో విభాగాల్లో పలు ఐటా టైటిల్స్‌ను గెలుచుకున్నాడు.
బధిరుల టెన్నిస్‌లోకి..
ఈ దశలో బధిరులకు ప్రత్యేకంగా టెన్నిస్ పోటీలు ఉంటాయనే విషయం సాయి తల్లిదండ్రులకు తెలిసింది. దాంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా వరుసగా రెండేళ్ల పాటు జాతీయ స్థాయిలో అతను విజేతగా నిలిచాడు. 2012లో పాటియాలాలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణాలు గెలుచుకున్నాడు. 2013లో ఔరంగాబాద్‌లో జరిగిన పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లో రజతాలు సాధించాడు.
చేజారిన ఒలింపిక్స్...
జాతీయస్థాయిలో నిలకడగా రాణించిన సాయికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెలక్షన్స్ ద్వారా అరుదైన అవకాశం దక్కింది. 2012 లండన్ పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను దాదాపుగా ఎంపికయ్యాడు. ప్రతిభపరంగా చక్కటి ప్రదర్శన కనబర్చినా... ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే కనీసం 15 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధనతో అతను వాటికి వెళ్లలేకపోయాడు.
ఆర్థిక సమస్యలతో...
ఈ దశలో సాయిచందన్‌కు ఇతర అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది. వరల్డ్ డెఫ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ కోసం ఎంపికైన తర్వాత కూడా సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్లలేని పరిస్థితిలో తప్పుకోవాల్సి వచ్చింది. గత రెండేళ్లలో వరుసగా మూడు పెద్ద ఈవెంట్లు బల్గేరియా, జర్మనీ, ఇటీవల జులైలో నాటింగ్‌హామ్ పోటీలకు ఎంపికైనా అవకాశం తప్పింది. కనీస మొత్తం డిపాజిట్ చేయలేకపోవడంతో అధికారులు వీసా తిరస్కరించారు. ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నట్లు లెటర్ ఉన్నా సాయికి ఆ పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ అదీ సాధ్యం కాలేదు. హోమియోపతి వైద్యుడిగా పరిమిత ఆదాయంతో తాము అంతటి భారం మోయలేకపోతున్నామని సాయి తండ్రి చెబుతున్నారు.
భవిష్యత్తుపై భరోసాతో...
అయితే సాయితో పాటు అతని తల్లిదండ్రులు కూడా సై ్థర్యం కోల్పోలేదు. కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని భావిస్తున్న వారు శిక్షణను కొనసాగిస్తున్నారు. సాధారణ కేటగిరీలో ఐటీఎఫ్‌తో పాటు డెఫ్ విభాగంలో 2016 రియో పారాలింపిక్స్‌లో పాల్గొనడమే లక్ష్యంగా పెట్టుకున్న సాయి తీవ్రంగా సాధన చేస్తున్నాడు. భారత జూనియర్ డేవిస్‌కప్‌కు గతంలో ప్రాతినిధ్యం వహించిన నున్నా గోపాలకృష్ణ తమ టెన్నిస్ కోర్టును శిక్షణ కోసం ఉచితంగా వాడుకునేందుకు అనుమతినిచ్చారు.
హమీద్ అనే కోచ్ ప్రస్తుతం శిక్షణనిస్తున్నారు. అక్టోబరులో చైనీస్ తైపీలో జరిగే మరో పెద్ద ఈవెంట్‌కు అతను ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే మరోసారి ఆర్థిక పరమైన ఇబ్బంది రాకుండా ఉండాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు స్పాన్సర్‌షిప్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఎవరైనా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే బాగుంటుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా మా అబ్బాయిని ఆటను వదిలేయమని చెప్పలేదు. చిన్నప్పటినుంచి బాగా ఆడాడు. కనీసం 20 ఏళ్ల వయసు వచ్చే సరికి అతను మరింత మంచి ఆటగాడిగా తయారవుతాడన్న ఆశతోనే దీనిని కొనసాగిస్తున్నాం’ అని తల్లి కృష్ణప్రియ చెబుతున్నారు. ఎవరైనా అండగా నిలిస్తే వారి కోరిక ఫలించడంలో సమస్య ఎదురు కాకపోవచ్చు.