ధోని పోరాడినా... | Delhi win big despite Dhoni 70 | Sakshi
Sakshi News home page

ధోని పోరాడినా...

Published Thu, Dec 24 2015 1:05 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

ధోని పోరాడినా... - Sakshi

ధోని పోరాడినా...

 జార్ఖండ్‌కు తప్పని ఓటమి విజయ్‌హజారే సెమీఫైనల్లో ఢిల్లీ

 బెంగళూరు:
విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మహేంద్రసింగ్ ధోని (108 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరోచిత పోరాటం జార్ఖండ్‌ను పరాజయంనుంచి తప్పించలేకపోయింది. ఢిల్లీతో బుధవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ 99 పరుగుల తేడాతో ఓడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 50 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.
 
  నితీశ్ రాణా (76 బంతుల్లో 44; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా, పవన్ నేగి (16 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివర్లో చెలరేగాడు. జార్ఖండ్ ఎక్స్‌ట్రాల రూపంలో 29 పరుగులు ఇవ్వడం విశేషం. అనంతరం జార్ఖండ్ 38 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ధోని మినహా మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. 9 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఇషాంత్ శర్మ వేసిన ఒకే ఓవర్లో అతను 2 సిక్సర్లు, ఫోర్ బాదాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్‌నుంచి అతనికి సహకారం అందకపోవడంతో ఢిల్లీ సునాయాసంగా సెమీస్ చేరింది.
 
 యువరాజ్ విఫలం: సెమీస్‌కు హిమాచల్
 ఆలూరు: మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ 5 వికెట్లతో పంజాబ్‌ను ఓడించి సెమీస్‌లోకి అడుగు పెట్టింది. ముందుగా పంజాబ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. మన్‌దీప్ సింగ్ (145 బంతుల్లో 119; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా, గుర్‌కీరత్ సింగ్ (35) ఫర్వాలేదనిపించాడు. ఈ టోర్నీలో నిలకడగా రాణించి భారత జట్టుకు ఎంపికైన యువరాజ్ సింగ్ (16 బంతుల్లో 5) క్వార్టర్స్‌లో మాత్రం విఫలమయ్యాడు. అనంతరం హిమాచల్ 49.2 ఓవర్లలో 5 వికెట్లకు 266 పరుగులు చేసింది. రాబిన్ బిస్త్ (135 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు) శతకం సాధించగా, రిషి ధావన్ (41), నిఖిల్ గంగ్తా (39) అండగా నిలిచాడు. గురువారం జరిగే క్వార్టర్స్‌లో  తమిళనాడుతో యూపీ, విదర్భతో గుజరాత్ తలపడతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement