
రెండు దశాబ్దాల కోరిక తీరింది
రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ కోసం కడుపారా తినాలనుకున్న అనేక ఆహార పదార్థాలకు సచిన్ దూరమయ్యాడు. అలాగే నచ్చినచోట సెలవులు గడపాలన్న కోరికనూ చంపుకున్నాడు.
రిటైర్‌మెంట్ తర్వాత సచిన్ ‘తొలి' సంగతులు
రెండున్నర దశాబ్దాల పాటు క్రికెట్ కోసం కడుపారా తినాలనుకున్న అనేక ఆహార పదార్థాలకు సచిన్ దూరమయ్యాడు. అలాగే నచ్చినచోట సెలవులు గడపాలన్న కోరికనూ చంపుకున్నాడు. గత ఏడాది క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక తనకు నచ్చిన అనేక పనులు చేసుకుంటున్నాడు. రిటైర్‌మెంట్ తర్వాత తన తొలి హాలిడే, కడుపు నిండా తిన్న స్నాక్స్... ఇలా అనేక ‘తొలి' అంశాల గురించి విశేషాలు మాస్టర్ మాటల్లోనే...
క్రికెట్‌ను వదిలేసినందుకు: ఇప్పటికీ బాధలేదు. లార్డ్స్‌లో ఎంసీసీ తరఫున మ్యాచ్ ఆడినప్పుడు సిడిల్ బౌలింగ్‌లో వరుసగా స్ట్రయిట్ డ్రైవ్, కవర్‌డ్రైవ్‌లతో రెండు ఫోర్లు కొట్టాను. అప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది.
తొలిసారి తిన్న స్నాక్స్: రిటైరైన రోజే హోటల్‌కు వెళ్లగానే షాంపేన్ తాగి, హలీమ్ తిన్నాను. మామూలుగా క్రికెట్ ఆడే రోజుల్లో ఫిట్‌నెస్ దృష్ట్యా ఎక్కువ తినేవాడిని కాదు. ఆ రోజు మాత్రం కడుపునిండా తిన్నా.
ఇచ్చిన తొలి సలహా: రహానేకు. ‘చాలాకాలంగా నిన్ను గమనిస్తున్నా. ఇప్పటిలాగే ఎప్పుడూ కష్టపడు. నువ్వు ఆట కోసం కష్టపడుతుంటే ఆటే నిన్ను ఎత్తుకు తీసుకెళుతుంది’ అని రహానేకు చెప్పాను.
ఆడిన ఆట: డిసెంబరు 5న ఎంసీఏ రిక్రియేషన్‌లో బ్యాడ్మింటన్ ఆడా. ముస్సోరీలో హాలిడేకు వెళ్లినప్పుడు కూడా బ్యాడ్మింటన్‌తోనే సమయం గడిపా.
తొలి హాలిడే: క్రిస్‌మస్ సమయంలో లండన్‌లో ఉండాలనేది గత 20 సంవత్సరాలుగా నా కోరిక. అక్కడ జరిగే సంబరాల గురించి వినడమే కానీ, ప్రత్యక్షంగా చూడలేకపోయా. ప్రతిసారీ షెడ్యూల్ కారణంగా డిసెంబరులో ఇంగ్లండ్ వెళ్లడం కుదిరేది కాదు. రిటైరయ్యాక డిసెంబరులో లండన్ వెళ్లి క్రిస్‌మస్ సంబరాలు చూశా.
మ్యూజిక్ కన్సర్ట్: మా పిల్లల్ని తీసుకుని లండన్‌లో ఒక మ్యూజిక్ కన్సర్ట్‌కు వెళ్లా. ఆ బ్యాండ్‌కు సంబంధించిన ఒక్కపాట కూడా అంతకుముందు నేను వినలేదు. కానీ పిల్లలు అడిగారని వెళ్లాం.
తొలిసారి బ్యాట్ పట్టుకుంది: డిసెంబరులోనే మా అబ్బాయి అర్జున్ మా ఇంటి వెనక స్నేహితులతో కలిసి ఆడుతున్నప్పుడు. ‘అంకుల్... ప్లీజ్ మాతో కొద్దిసేపు ఆడండి’ అని అర్జున్ స్నేహితులు అడిగారు.
ఆటలో ఉన్నప్పటి స్థాయిలో కష్టపడింది: జనవరిలో బ్యాడ్మింటన్ ఆడటం కోసం బాగా కష్టపడ్డా.
రిటైరయ్యాక బాగా ఎమోషనల్ అయింది: రిటైరయిన తర్వాతి రోజు మా అమ్మ భగవంతుడికి హారతి ఇచ్చి, దేవుడి ముందు స్వీట్స్ ఉంచింది. సాధారణంగా నేను క్రికెట్ టూర్ ముగించుకుని వచ్చిన ప్రతిసారీ అలా చేస్తుంది. దీంతో కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యా.
తొలిసారి చేసిన డ్యాన్స్: డిసెంబరు 31కి. పిల్లలతో, స్నేహితులు అమోల్ మజుందార్, సాయిరాజ్ బహుతులే, అతుల్‌లతో కలిసి బీకేసీలో జరిగిన పార్టీలో డ్యాన్స్ చేశా.