మరో సవాల్ కు ధోని సేన సిద్ధం
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేలో సిరీస్లో చివరి వన్డేలో గెలిచి ఊరట పొందిన మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా మరో సవాల్ కు సన్నద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్ లో భాగంగా మంగళవారం నుంచి ట్వంటీ 20 సిరీస్ ఆరంభం కానుంది. రేపు మధ్యాహ్నం గం.2.08 ని.లకు(భారత కాలమాన ప్రకారం) అడిలైడ్ వేదికగా తొలి డే అండ్ నైట్ ట్వంటీ 20 జరుగనుంది. వన్డే సిరీస్ లో భారీ స్కోర్లు సాధించినా సిరీస్ ను కోల్పోయిన ధోని సేన.. . ట్వంటీ 20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. త్వరలో భారత్ లో ట్వంటీ 20 వరల్డ్ కప్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ ద్వారా తనదైన ముద్ర వేయడానికి టీమిండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఒకపక్క వన్డే సిరీస్ లో ఘోర పరాభవం.. మరోపక్క ఒక్కసారిగా ధోని కెప్టెన్సీపై వెల్లువెత్తిన విమర్శలకు తగిన సమాధానం చెప్పాలంటే ట్వంటీ 20 సిరీస్ ను సాధించడమే టీమిండియా జట్టు ముందున్న లక్ష్యం. ట్వంటీ 20 క్రికెట్ లో టీమిండియా సమతుల్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఆసీస్ కూడా అంతే బలంగా ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య మరోసారి రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.
యువరాజ్ కు పరీక్ష
దాదాపు 20 నెలల తరువాత జాతీయ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ అసలు సిసలైన పరీక్షకు సన్నద్ధమవుతున్నాడు. యువరాజ్ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటేనే టీమిండియా జట్టులో మనుగడ సాధ్యం. ఒకవేళ కాని పక్షంలో రాబోవు ట్వంటీ 20 వరల్డ్ కప్ కు అతని స్థానంపై గ్యారంటీ లేదు. ప్రస్తుతం టీమిండియా జట్టులో మనీష్ పాండే, రిషి ధావన్ వంటి యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో యువీకి ఈ సిరీస్ కచ్చితంగా ఒక సవాలే. గత కొంతకాలంగా దేశవాళీ మ్యాచ్ ల్లో నిలకడగా రాణిస్తున్న యువరాజ్ కు వన్డేల్లో చోటివ్వకుండా.. ట్వంటీ 20లకు మాత్రమే పరిమితం చేశారు. యువరాజ్ ను పూర్తిగా పక్కకు పెట్టాడానికే అతనికి చివరి అవకాశంగా ట్వంటీ 20ల్లో అవకాశం కల్పించినట్లు వార్తలు వినిపించాయి. వీటన్నంటికీ సమాధానం చెప్పడంతో పాటు, ఇది అతని కెరీర్ కు ఆరంభమా?, ముగింపా? అనేది తేల్చుకోవాలంటే అది యువీ చేతుల్లోనే ఉంది.
టీమిండియా జట్టులో రెండు మార్పులు
కేవలం వన్డేలు మాత్రమే ఎంపికైన రిషి ధావన్, గుర్ కీరత్ లకు అనూహ్యంగా ట్వంటీ 20 సిరీస్ జట్టులో స్థానం దక్కింది. గాయపడ్డ అజింక్యా రహానే స్థానంలో అతని ప్రత్యామ్నాయంగా గుర్ కీరత్ సింగ్ జట్టులోకి రాగా, బౌలర్ భువనేశ్వర్ గాయం కారణంగా రిషి ధావన్ ను జట్టులో అవకాశం కల్పించనున్నారు.
వాతావరణం
ఆకాశం ఎక్కువ శాతం మేఘావృతమై ఉన్నా వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అడిలైడ్ లో కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానుంది.