
సర్వశక్తులతో సత్తా చాటుతాం
ఐపీఎల్ అనుభవం చాలు
టి20 ప్రపంచ అవకాశాలపై కెప్టెన్ ధోని వ్యాఖ్య
బంగ్లాదేశ్ చేరిన భారత జట్టు
ఢాకా: ఇటీవలి కాలంలో అంతర్జాతీయ టి20లు ఆడకపోయినా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గతానుభవం ప్రపంచకప్‌లో ఉపయోగపడుతుందని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అన్నాడు. ఈ నెల 16 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ధోని సారథ్యంలోని భారత జట్టు బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టింది. టోర్నీకి ముందు తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ధోని ‘జట్టులో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో చాలా మ్యాచ్‌లు ఆడారు.
అవి అంతర్జాతీయ టి20లు కాకపోయినా, ఆ అనుభవం భారత్‌కు ఉపయోగపడుతుంది’ అని అన్నాడు. గత టి20 ప్రపంచకప్ నుంచి భారత్ కేవలం ఐదు అంతర్జాతీయ టి20లు మాత్రమే ఆడింది. 2013లో భారత్ కేవలం ఒకే ఒక అంతర్జాతీయ టి20లో బరిలోకి దిగింది. అయితే అంతర్జాతీయ టి20లు అంతగా ఆడకపోయినా ఇక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్‌లు భారత్‌లోలాగే ఉండటం తమ జట్టుకు ప్రయోజనకరమని ధోని చెప్పాడు. వివిధ అంశాలపై ధోని అభిప్రాయాలు అతని మాటల్లోనే...
టోర్నీకి ముందు శ్రీలంక (మార్చి 17న), ఇంగ్లండ్ (మార్చి 19న)తో సన్నాహక టి20లు ఆడతాం. ఈ మ్యాచ్‌ల్లో అందరినీ పరీక్షిస్తాం. పలు ప్రయోగాలు కూడా చేస్తాం. జట్టుకు ఏది ఉపయోగమో ఈ మ్యాచ్‌ల ద్వారా తెలుస్తుంది.
టి20 ప్రపంచకప్ ప్రతీ మ్యాచ్ కీలకమే. టోర్నీలో సత్తా చాటాలంటే ప్రతీ ఒక్కరు చివరివరకు కష్టపడాల్సిందే. గత ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లోనే ఓడినా టోర్నీని నిష్ర్కమించాల్సి వచ్చింది. ఈసారి చాలా కష్టమైన గ్రూప్ (పాకిస్థాన్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్)లో ఉన్నాం. ఒక్క మ్యాచ్‌లో ఓడినా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే టోర్నీలో సర్వశక్తులు ఒడ్డి సత్తా చాటుతాం. చాలా జట్లు ఎక్కువగా టి20 మ్యాచ్‌లు ఆడవు. బిజీ షెడ్యూల్ కారణంగా మేము ఒక సిరీస్‌లో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లే ఆడతాం.
అదే సమయంలో మేము ఎక్కువగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతాం. అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌లో పాల్గొంటారు. ఈ అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇటీవలి కాలంలో కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. సిరీస్‌లు గెలిచే సత్తా ఉన్నా దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ పర్యటనలో చెత్త క్రికెట్ ఆడాం. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. దాన్ని అధిగమిస్తాంగాయం కారణంగా నాకు విశ్రాంతి దొరికింది. ఇది టి20 ప్రపంచకప్‌లో రాణించేందుకు ఉపయోగపడుతుందని అశిస్తున్నాను.