జొహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ మైదానంలో కొత్త చరిత్ర... తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచిన రోజు... ప్రపంచ కప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడాలని, వారిని ఓడించి విశ్వవిజేతగా నిలవాలని సగటు క్రికెట్ అభిమాని కన్న కలలు నిజం చేసిన రోజు. శ్రీశాంత్ పట్టిన మిస్బావుల్ హక్ క్యాచ్ టీమిండియాకు కప్ మాత్రమే అందించలేదు... టి20 క్రికెట్‌కు కొత్త కళను తెచ్చింది. పొట్టి ఫార్మాట్ విలువను ప్రపంచానికి చూపించింది. మరుసటి ఏడాదే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో టి20 క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిందంటే అందుకు భారత్ సాధించిన విజయమే కారణం. ఐపీఎల్ ఒక్కటే కాదు... ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌లు రావడానికి టీమిండియా గెలుపే కారణమంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి తమకే కొత్తగా కనిపించిన ఆటలో సరిగ్గా పదేళ్ల క్రితం ధోని సేన సృష్టించిన సంచలనాన్ని ఎవరు మరిచిపోగలరు?
సాక్షి క్రీడా విభాగం : ద్రవిడ్ వద్దనుకున్నాడు... గంగూలీ తన వల్ల కాదన్నాడు... సచిన్ తన అవసరం లేదన్నాడు... 2007 టి20 ప్రపంచ కప్‌కు ముందు భారత జట్టు కెప్టెన్‌ను, జట్టును ఎంపిక చేసే సమయంలో పరిస్థితి ఇది. అదే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఘోర పరాభవం తాలూకు జ్ఞాపకాలను ఈ దిగ్గజాలు మరచిపోలేదు. అందుకే ఈ ఫార్మాట్ కుర్రాళ్ల కోసమంటూ తమం తట తాముగా జట్టు నుంచి తప్పుకున్నారు. పనిలో పనిగా ధోనిని వరల్డ్ కప్ కోసం కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందని కూడా సచిన్ సలహా ఇచ్చాడు. నాయకుడిగా ధోనికి గతానుభవం కూడా ఏమీ లేదు. కానీ సచిన్ సూచనను బీసీసీఐ అమలు చేసింది. అప్పటి వరకు భారత్ ఒకే ఒక అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడింది. ఇలాంటి సమయంలో ‘టైటి ల్ సాధించడమే మా లక్ష్యం’ అంటూ భారత జట్టు భారీ ప్రకటనలు ఏమీ చేయలేదు. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి జట్లతో పోలిస్తే పొట్టి ఫార్మాట్‌కు ఒక రకంగా కొత్త అయిన టీమిండియా ఎలాంటి ఆశలు, అంచనాలు లేకుండా వరల్డ్ కప్ బరిలోకి దిగింది. ఆ సమయంలో ఆటగాళ్ల దృష్టిలో అది ఒక సరదా ‘సఫారీ’ టూర్ మాత్రమే. కానీ ధోని నాయకత్వంలో యువ భారత్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకు పోయింది.
‘బౌల్డ్ అవుట్’ క్షణం...
కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లో ధోని తొందరగానే మరచిపోయే ఫలితం వచ్చింది. స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ వేశాక వర్షంతో ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరు మాత్రం మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇరు జట్లు 149 పరుగులే చేయడంతో విజేతను తేల్చేందుకు ఫుట్‌బాల్ పెనాల్టీ షూటౌట్ తరహాలో ‘బౌల్డ్ అవుట్’ను ఉపయోగించారు. భారత్ తరఫున సెహ్వాగ్, హర్భజన్, ఉతప్ప బంతులు వికెట్లను పడగొట్టగా... పాక్ తరఫున అరాఫత్, గుల్, ఆఫ్రిది విఫలం కావడంతో భారత్ గెలుపు బోణీ చేసింది. అయితే తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 పరుగులతో గెలిచి భారత్‌కు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత టీమిండియా జోరు మొదలైంది. సెమీస్ చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ధోని బృందం వరుసగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను చిత్తు చేసింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం ఈ వరల్డ్ కప్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లోనూ టీమిండియా తమ పట్టు నిలబెట్టుకుంటూ 15 పరుగులతో గెలిచి దాయాదితో తుది పోరుకు సిద్ధమైంది.
హీరో జోగీందర్...
పాకిస్తాన్‌తో ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు గంభీర్ (75) ప్రదర్శనతో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాకిస్తాన్ మాత్రం 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ కావడంతో 5 పరుగులతో విజయం సాధించిన ధోని సేన కప్‌ను ముద్దాడింది. మిస్బావుల్ హక్ చివరి వరకు ప్రమాదకరంగా కనిపించినా... అతని ఒక్క షాట్‌తో పాక్ తలరాత మారిపోయింది. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 13 పరుగులు అవసరం. సీనియర్ హర్భజన్ సింగ్‌ను కాదని పేసర్ జోగీందర్ శర్మపై కెప్టెన్ ధోని నమ్మకముంచాడు. ‘ఎవరూ నీ మ్యాచ్‌లు చూడని సమయంలో దేశవాళీ క్రికెట్‌లో అంకితభావంతో ఎన్నో ఓవర్లు వేసి ఉంటావు. భయపడకు, క్రికెట్ ఈసారి నిన్ను నిరాశపర్చదు’... ఇవీ జోగీందర్‌కు ఆ సమయంలో ధోని చెప్పిన మాటలు. అయితే మిస్బా సిక్సర్ బాదడంతో తొలి 2 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. మరో 4 బంతుల్లో 6 పరుగులు చేస్తే చాలు. అయితే మూడో బంతిని స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో మిస్బా గాల్లోకి లేపడం... షార్ట్ ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్ క్యాచ్ పట్టుకోవడం అంతా కలలా జరిగిపోయింది. అంతే... భారత్ సంబరాలకు అంతు లేకుండా పోయింది.
ధోని మాటల్లో ఆ క్షణం...
‘మిస్బా షాట్ కొట్టగానే ఇక పోయిందని అనుకున్నాను. ఒక బౌన్స్‌తో బంతి బౌండరీ దాటుతుందని భావించా. అయితే షాట్ ఆడాక బంతి చాలా నెమ్మదిగా వెళుతున్నట్లు అనిపించింది. అప్పుడు శ్రీశాంత్ వైపు చూశాను. అతను బంతి వద్దకు వచ్చే లోపే మూడు సార్లు తడబడ్డాడు. అతను క్యాచ్ వదిలేస్తే ఏం జరుగుతుందో ఊహించలేకపోతున్నా. ఎందుకంటే సులువైన క్యాచ్‌లే కొన్ని సార్లు కష్టంగా మారిపోతాయి. వదిలేస్తే నా పరిస్థితి ఏమిటనే భయం అతనికీ ఉంటుంది. కాబట్టి నా దృష్టిలో అది అన్నింటికంటే కఠినమైన క్యాచ్.’