శ్రీలంకపై భారత్ గెలుపు
♦ అర్ధ సెంచరీతో కదం తొక్కిన భువనేశ్వర్ కుమార్
పల్లెకెలె: భారత్-శ్రీలంక మధ్య ఉత్కంఠభరితంగా సాగిన రెండో వన్డేలో ధోని-భువనేశ్వర్‌ల క్లాసిక్ ఇన్నింగ్స్‌తో భారత్ గట్టెక్కింది. ఒకానొక దశలో ఓటమి అంచుకు చేరిన భారత్ చివరికి 3 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అంతకు ముందు 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ(54), శిఖర్‌ధావన్(49)లు మంచి శుభారంబాన్ని అందించారు. లంక స్పిన్నర్ అఖిల ధనంజయ ఓపెనర్ రోహిత్‌ను అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అప్పటి వరకు పటిష్టంగా కనిపించిన భారత్ ధనంజయ స్పిన్ మాయాజాలానికి ఒక్కసారిగా కుప్పకూలింది.ఆ వెంటనే శిఖర్ ధావన్ సిరివర్ధన బౌలింగ్‌లో క్యాచ్ అవుటై అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. ధనుంజయ వరుస ఓవర్లో జాదవ్(1), కెప్టెన్ విరాట్ కోహ్లి(4), కేఎల్ రాహుల్(4), హార్ధిక్ పాండ్యా(0), అక్షర్ పటేల్(6) లను అవుట్ చేసి మొత్తం 6 వికెట్లతో భారత బ్యాటింగ్ ఆర్డర్ ను దెబ్బతీశాడు. భారత్ కేవలం 22 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ తరుణంలో క్రీజులో ఉన్న మహేంద్రసింగ్ ధోని, భువనేశ్వర్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూ వీలు చిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలించారు. ధోని(45) క్లాస్‌గా ఆడినా భువీ వేగంగా ఆడుతూ (51; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెరీర్‌లో తొలి అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో భారత్ విజయం సునాయసమైంది. 6 వికెట్లతో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన శ్రీలంక యువ స్పిన్నర్ ధనంజయకు మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ వరించింది.
ధోని అవుట్.. జస్ట్‌మిస్..
ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ‘అదృష్టం తలుపు తడితే దురదృష్టం వెనుక తలుపు తట్టినట్లు’ అయింది. దాదాపు విజయం కాయం అనుకున్న సందర్భంలో ధోని-భువీ 8వ వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యంతో శ్రీలంక నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. లంక బౌలర్ ఫెర్నాండో వేసిన 34 ఓవర్ మూడో బంతి నేరుగా వికెట్లకు తగిలింది. అయితే స్టంప్స్ కింద పడకపోవడంతో ధోనిని అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ధోని భువీతో కలిసి మ్యాచ్‌ను భారత్‌వైపు తిప్పాడు.