
టెస్టుల నుంచి ధోని తప్పుకుంటున్నాడా?
ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం తర్వాత టెస్టు క్రికెట్‌కు భారత కెప్టెన్ ధోని గుడ్‌బై చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. 2012లో ఆస్ట్రేలియాలో ఘోర పరాజయం తర్వాత... ‘ఏదో ఒక ఫార్మాట్ నుంచి త్వరలో తప్పుకుంటాను’ అని ధోని చెప్పాడు. తాజాగా ఇంగ్లండ్‌లో ఆదివారం మ్యాచ్ తర్వాత ‘నేను గరిష్టంగా ఏం చేయగలనో అది చేశాను. ఇంకా జట్టును ముందుకు తీసుకెళ్లేంత దృఢంగా ఉన్నానా, లేదా అనేది వేచి చూడండి. ఓ వార్త కోసం మీరు ఎదురు చూడాల్సిందే’ అని ధోని వ్యాఖ్యానించాడు.
బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం కోల్పోవడమే సిరీస్‌లో ఓటమికి ప్రధాన కారణమని ధోని విశ్లేషించాడు. ‘కచ్చితంగా ఈ ఫలితం తీవ్ర నిరాశను కలిగించింది. 150 పరుగులు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేలేం. సిరీస్ ఆసాంతం మా బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడిలో ఆడారు. ఆత్మవిశ్వాసం కోల్పోయారు. చాలామంది కుర్రాళ్లు భారత్ బయట టెస్టులు ఆడలేదు. దీని నుంచి వారు భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటారు’ అని ధోని అన్నాడు.