మొహాక్... మహీ! | Dhoni's new hairstyle a rage among fans | Sakshi
Sakshi News home page

మొహాక్... మహీ!

Published Tue, Sep 24 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 10:59 PM

మొహాక్... మహీ!

మొహాక్... మహీ!

రాంచీ: మైదానంలో ఎవరికీ చిక్కని వ్యూహాలతో తన జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ ఎం.ఎస్.ధోని తన వేషభాషలతో కూడా అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఫుట్‌బాల్ క్రీడను అమితంగా ఇష్టపడే ఈ జార్ఖండ్ డైనమైట్ దాదాపు పదేళ్ల క్రితం నుంచే హెయిర్ స్టయిల్‌లో తనదైన ముద్రను వేస్తూ వస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో అందరికీ జులపాల జుట్టుతో అభిమాన పాత్రుడయ్యాడు. ఏకంగా అప్పటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్ కూడా అతడి అభిమాన జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత వెంటనే వెంట్రుకలను చిన్నగా కత్తిరించి కనిపించాడు. వన్డే ప్రపంచకప్ గెలవగానే గుండుతో కనిపించాడు. ఇలా రకరకాల స్టయిల్స్‌తో కేవలం రాంచీ అభిమానులకే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులకు కొత్త స్టైల్స్ పరిచయం చేశాడు.
 
అయితే తాజాగా చాంపియన్స్ లీగ్ టి20లో  సరికొత్తగా ‘మొహాక్’ స్టయిల్‌కు తెర లేపాడు. రెండు వైపులా వెంట్రుకలను నున్నగా షేవ్ చేసి మధ్యలో ఓ స్ట్రిప్‌లా ఉంచుకుని అభిమానులను సంభ్రమాశ్చర్యంలో ముంచా డు. పాశ్చాత్య దేశాల్లో ఇది సహజమే అయినా భారత అభిమానులను మాత్రం ఇది విశేషంగా ఆకర్షిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లండ్ స్టార్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్ ఇలాగే కనిపించేవాడు. అప్పట్లో ధోని జులపాల నెత్తిని అతడి తండ్రి చీదరించుకునే వారట. చిన్నగా కత్తిరిస్తే ఏమవుతుందని అడిగేవారట. అయితే ఈ స్టయిల్ తన కు గొప్ప పేరు తెచ్చి పెడుతుందని ధోని అనేవాడు. తాజాగా ఈ మొహాక్ స్టయిల్ అప్పుడే రాంచీలో కుర్రాళ్లకు ఎక్కేసింది. 
 
సెలూన్లకు క్యూ కడుతున్నారు
రాంచీలో ఉన్నప్పుడు ధోని క్షవరం కోసం అక్కడి కాయా సెలూన్‌కు వెళతాడు. ఈ విషయం తెలిసిన ప్రతిసారీ అభిమానులు అక్కడ గుమిగూడుతున్నారు. దీంతో వీరిని అదుపులో పెట్టడం పోలీసులకు కష్టసాధ్యంగా ఉంటుంది. 2006 నవంబర్‌లో ఓసారి ఇలాగే సెలూన్ వెళ్లినప్పుడు అభిమానుల తొక్కిసలాట జరిగింది. దీంతో అప్పటి రాంచీ ఎస్పీ అఖిలేష్ కుమార్ జా ధోనికి ఓ సలహా ఇచ్చారు. దయచేసి మరోసారి సెలూన్‌కు వెళితే మాకు సమాచారం ఇచ్చి వెళ్లండి అని కోరారు. అభిమానుల్లో ధోనికి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడు రెట్టింపయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement