అండర్-16 ఆటగాళ్ల వయసును నిర్ధారించేందుకు బీసీసీఐ అనుసరిస్తున్న పద్ధతిలో జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది
ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : అండర్-16 ఆటగాళ్ల వయసును నిర్ధారించేందుకు బీసీసీఐ అనుసరిస్తున్న పద్ధతిలో జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. బోర్డు పాలసీ, పరీక్ష ప్రామాణికత సహేతుకంగానే ఉందని వెల్లడించింది. ‘బీసీసీఐ అనుసరిస్తున్న టన్నర్ వైట్‌హౌస్ (టీడబ్ల్యు-3) పరీక్ష వల్ల ఆటగాళ్ల వయసులో ఉన్న హెచ్చు తగ్గులు బాగా తెలుస్తున్నాయి. ఆటగాళ్ల మధ్య వివక్ష లేకుండా చూడటానికి కూడా ఇది దోహదపడుతుంది’ అని చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్‌లతో కూడిన ద్విసభ్య బెంచ్ తమ ఆదేశాల్లో పేర్కొంది.
రెండేళ్ల కిందట యష్, ఆర్యన్ అనే ఇద్దరు క్రికెటర్లు వయసు అధికంగా ఉండటంతో అండర్-16 టోర్నీలో ఆడకుండా బీసీసీఐ అడ్డుకుంది. దీంతో ఆ ఇద్దరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.