'ఆ బౌలర్ ను ఎదుర్కోవడం చాలా కష్టం'
హైదరాబాద్: కొత్త ఫ్రాంచైజీ అయినప్పటికీ వరుస విజయాలతో దుమ్మురేపిన తమ జట్టు ఓటముల బాట పట్టడాన్ని గుజరాత్ లయన్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో జీర్ణించుకోలేక పోతున్నాడు. వర్షం కురిసి స్టేడియం ఔట్ ఫీల్డ్ అంతగా సెట్ అవ్వలేదని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా తమ బ్యాట్స్ మన్ కుదురుకోలేదని అభిప్రాయపడ్డాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో గుజరాత్ లయన్స్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన అనంతరం బ్రావో మీడియాతో మాట్లాడాడు.
భువనేశ్వర్ బౌలింగ్ ఆటను మార్చేసిందని, అతను వేసిన తొలి ఓవర్ అద్భుతమని ప్రశంసించాడు. శిఖర్ ధావన్ (47 నాటౌట్; 6 ఫోర్లు) రాణించినప్పటికీ అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన భువీ(2/28)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి పరిస్థితుల్లో భువీ లాంటి ప్రధాన పేస్ బౌలర్ ను ఎదుర్కొవడం చాలా కష్టమన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ స్వింగ్ రాబట్టే బౌలర్లలో భువీ ఒకడని చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ ఆటగాళ్లం అయినా, పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాలి. అలాంటిది జరగనందున లయన్స్ కు ఓటమి తప్పలేదన్నాడు.