
శ్రీలంక క్రికెట్ కు ఇద్దరు కెప్టెన్లు!
కొలంబో:ఇటీవల శ్రీలంక క్రికెట్ కెప్టెన్సీ పదవి నుంచి ఏంజెలో మాథ్యూస్ తప్పుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో జింబాబ్వే తో జరిగిన వన్డే సిరీస్ ను కోల్పోయిన తరువాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దాంతో శ్రీలంక క్రికెట్ లో ఒక్కసారిగా అనిశ్చితి ఏర్పడింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు కసరత్తులు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఎట్టకేలకు ఇద్దర్ని కెప్టెన్లను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీలంక టెస్టు కెప్టెన్ గా దినేష్ చండిమాల్ ను , వన్డే, ట్వంటీ 20(పరిమిత ఓవర్ల) కెప్టెన్ గా ఉపుల్ తరంగాను ఎంపిక చేసింది.
ఈ మేరకు మాట్లాడిన చండిమాల్.. కెప్టెన్ గా మాథ్యూస్ తప్పుకోవడం తమ జట్టుకు లోటేనన్నాడు. శ్రీలంక జట్టును ముందుకు తీసుకెళ్లడంలో మాథ్యూస్ తన శక్తిమేర కృషి చేసినందుకు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నుంచి మాథ్యూస్ జట్టులో సభ్యుడిగా ఉంటూ సేవలందిస్తాడని పేర్కొన్న చండిమాల్.. కెప్టెన్సీ అనేది ఈజీ జాబ్ కాదనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందేనన్నాడు. 2011టెస్టుల్లో అరంగేట్రం చేసిన చండిమాల్.. ఇప్పటివరకూ 36 టెస్టుల్లో 42.33 సగటుతో 2,540 పరుగులు చేశాడు.