
దినేశ్ కార్తీక్, వెంకటేశ్ ప్రసాద్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) జట్టు కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ యాజమాన్యం ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు ఆదివారం జట్టు పగ్గాలు అప్పగించింది. రాబిన్ ఉతప్పను వైస్ కెప్టెన్‌గా నియమించింది. కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ జట్టు సమతూకంగా ఉందని దినేశ్ ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ ‘భారత కెప్టెన్ విరాట్ కోహ్లి స్ఫూర్తితో కోల్‌కతాను నడిపిస్తా. మా జట్టులో ముగ్గురు మణికట్టు స్పిన్నర్లున్నారు. సునీల్ నరైన్, కుల్దీప్ యాదవ్, పీయూష్ చావ్లాలు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇరుకున పెడతారు. అనుభవజ్ఞులైన హీత్ స్ట్రీక్ (బౌలింగ్ కోచ్), జాక్వెస్ కలిస్ (మెంటార్)లతో కూడిన కోచింగ్ సిబ్బంది అందుబాటులో ఉంది. ఈ సీజన్‌లో మేం తప్పకుండా రాణిస్తాం’ అని అన్నాడు.
పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా ప్రసాద్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలింగ్ కోచ్‌గా వెంకటేశ్ ప్రసాద్‌ను నియమించారు. పంజాబ్ యాజమాన్యం నుంచి ఆఫర్ రావడంతో జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి ప్రసాద్ రాజీనామా చేశారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జట్టు ప్రధాన కోచ్‌గా మాజీ ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాగ్‌ను నియమించినట్లు ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ జట్టు మెంటార్‌గా కొనసాగుతున్నాడు.