న్యూఢిల్లీ: ఇటీవల క్రికెట్ పరిపాలక కమిటీ(సీఓఏ) ఖరారు చేసిన ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్‌లో చతేశ్వర్ పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కకపోవడాని బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా తీవ్రంగా తప్పుబట్టారు. ఈ విషయంలో పుజారాకు న్యాయం జరగలేదనేది బహిరంగంగానే కనబడుతోందంటూ సీఓఏపై మండిపడ్డారు. ఈసారి పుజారాను ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చూస్తానని తాను బలంగా అనుకున్నానని, కానీ అది జరగకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యానని సౌరాష్ట్రకు సుదీర్ఘ కాలం సెక్రటరీగా పనిచేసిన నిరంజన్ పేర్కొన్నారు.
‘2018-19కి గాను ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ దక్కడ పోవడం నిజంగా బాధాకరం. ఇది పూర్తి పారదర్శకతతో ఖరారు చేసిన జాబితా కాదు. ఇక్కడ సీఓఏ టెస్టులకు అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదనడానికి ఇదే నిదర్శనం. పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్‌లో చోటుకు అన్ని విధాల అర్హుడు. గ్రేడ్‌లు కేటాయించేటప్పుడు టెస్టుల్లో ఆట తీరు ర్యాంకులు ఆధారంగా చేసుకోవాలి. మరి అటువంటప్పుడు పుజారాకు ‘ఎ ప్లస్’ గ్రేడ్ ఎందుకు దక్కలేదు’ అని నిరంజన్ షా ప్రశ్నించారు. ప్రస్తుతం పుజారా ‘ఎ’ గ్రేడ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ జట్టు టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో పుజారా కీలక పాత్ర పోషించాడు. మూడు సెంచరీల సాయంతో 521 పరుగులు చేసి భారత్ సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక వహించాడు.
బీసీసీఐ గ్రేడింగ్‌లో గత ఏడాదే చేర్చిన ‘ఎ ప్లస్’ గ్రేడ్ అన్నింటికంటే అత్యుత్తమం. రూ. 7 కోట్లు లభించే ఈ జాబితాలో గత ఏడాది ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు. అయితే వీరిలో మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్‌గా ఉన్న కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, బుమ్రాలను మాత్రమే ఉంచి ఈసారి భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్‌లను తప్పించారు. కాగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌కు బీసీసీఐనుంచి తగిన గుర్తింపు లభించింది. అతనికి ‘ఎ’ గ్రేడ్ ఖరారు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment