'కటక్కు రెండేళ్లు మ్యాచ్లు కేటాయించరాదు'
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా రెండో టి-20 మ్యాచ్ సందర్భంగా కటక్ స్టేడియంలో ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లు విసిరి రభస చేయడంపై టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. కటక్ బారాబతి స్టేడియంలో రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధం విధించాలని గవాస్కర్ సూచించాడు.
సోమవారం కటక్లో జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ 92 పరుగులకు ఆలౌటయిన తర్వాత ప్రేక్షకులు వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరి ఆటకు అంతరాయం కలిగించారు. ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనను గవాస్కర్ తప్పుపట్టాడు. ఈ ఘటనకు పోలీసులదే బాధ్యతని అన్నాడు. కటక్కు మరో రెండేళ్ల అంతర్జాతీయ మ్యాచ్ కేటాయించకపోవడంతో పాటు ఒడిశా క్రికెట్ సంఘానికి సబ్సిడీలు ఆపేయాలని గవాస్కర్ సూచించారు.