
ఆ జాబితాలో నేనున్నానో లేదో తెలీదు
⇒కోహ్లి వ్యాఖ్యలపై స్టీవ్ స్మిత్
⇒పుణే జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పిన ఇద్దరు ‘శత్రువుల’ జాబితాలో తాను ఉన్నదీ.. లేనిదీ తెలీదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. ఆసీస్ ఆటగాళ్లతో ఇక నుంచి స్నేహం ఉండదని చివరి టెస్టు ముగిశాక కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తను వివరణ ఇస్తూ ఇద్దరి గురించే ఆ వ్యాఖ్య చేసినట్టు చెప్పాడు. ఐపీఎల్–10లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కెప్టెన్‌గా ఎంపికైన స్మిత్ గురువారం టీమ్ జెర్సీ ఆవిష్కరణలో పాల్గొన్నాడు. ఇందులో పుణే జట్టు సభ్యులైన అజింక్య రహానేతో పాటు ఇటీవలే జట్టులో చేరిన బెన్ స్టోక్స్ కూడా పాల్గొన్నాడు. ‘ఆ ఇద్దరు ఎవరు అనేది కోహ్లి తేల్చాల్సిన విషయం. నాకైతే అందులో ఉన్నానో లేదో తెలీదు. నా అభిప్రాయం ప్రకారం టెస్టు సిరీస్ ముగిసింది. భారత్ మాకన్నా మెరుగ్గా ఆడింది. ఇప్పుడు పుణే సూపర్ జెయింట్‌ను నడిపించడంపైనే దృష్టి పెట్టాను’ అని స్మిత్ స్పష్టం చేశాడు.
ధోనితో విభేదాల్లేవు: మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనితో తనకెలాంటి విభేదాలు లేవని పుణే తాజా కెప్టెన్ స్మిత్ తేల్చి చెప్పాడు. ఇప్పటికే తామిద్దరం సందేశాలు పంపుకున్నామని, తనకు మద్దతుగా ఉన్నాడని తెలిపాడు. గత సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే నెగ్గిన పుణే పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో పదో సీజన్ కోసం జట్టు యాజమాన్యం ధోనిని తప్పించి స్మిత్‌ను కెప్టెన్‌గా చేసింది. ‘వివిధ దేశాల నుంచి అద్భుత ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇది నాకు అనుకూలంగా ఉంటుందే తప్ప అడ్డంకి కాబోదు. అయితే లీగ్‌లో ఎక్కువ మంది అభిప్రాయాలను తీసుకోను. ఇది నా సొంత నిర్ణయాన్ని దెబ్బతీస్తుంది’ అని స్మిత్ చెప్పాడు.
బీరు పార్టీకి వెళ్లలేదు: రహానే
ధర్మశాల టెస్టు ముగిశాక ఆసీస్ జట్టు తనను బీరు పార్టీకి రమ్మని పిలిచినా వెళ్లలేదని ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే తెలిపాడు. ‘మా డ్రెస్సింగ్ రూమ్‌లో మేం సంబరాల్లో మునిగి ఉన్నాం. నేనక్కడే బిజీగా ఉన్నాను. సుదీర్ఘ సీజన్ తర్వాత మేం చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఇక నేను ప్రశాంతంగా ఉండడంతోనే నా ఉత్తమ ఆట బయటకు వస్తుంది. కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. అతడికి అదే బలం. ఇప్పుడు ఐపీఎల్‌పైనే నా దృష్టి ఉంది’ అని రహానే అన్నాడు.