డోన్ట్ వర్రి ముస్తఫా..! | dont worry Mustafa ... | Sakshi
Sakshi News home page

డోన్ట్ వర్రి ముస్తఫా..!

Published Fri, May 27 2016 12:19 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

డోన్ట్ వర్రి ముస్తఫా..!

డోన్ట్ వర్రి ముస్తఫా..!

మణికట్టును గుండ్రంగా తిప్పితే అతను స్లో బాల్ వేయబోతున్నట్లు... తన తలపై  చేతిని పెడితే తర్వాతి బంతిని బౌన్సర్ విసరబోతున్నట్లు... ఆంగ్లంలో  తెలిసినవి రెండే పదాలు ప్రాబ్లం, నో ప్రాబ్లం... ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ విజయపరంపరలో కీలకంగా నిలిచిన ముస్తఫిజుర్ రహమాన్ తిప్పలు ఇవి. సీజన్‌లో సూపర్ సక్సెస్‌గా నిలిచినా...బెంగాలీ తప్ప మరో భాష రాకపోవడంతో అతను పాపం ఎక్కడో అడవిలో ఉన్నట్లే గడపాల్సి వచ్చింది. సహచరుడు రికీ భుయ్ ఆదుకోకపోతే ముస్తఫిజుర్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉండేది.

 

నాకు నచ్చనివి రెండే విషయాలు... ఒకటి బ్యాటింగ్ చేయడం, రెండు ఇంగ్లీష్‌లో మాట్లాడటం... అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిననాటినుంచి ముస్తఫిజుర్ చెప్పే రెగ్యులర్ డైలాగ్ ఇది. బంగ్లాదేశ్ జాతీయ జట్టులో అందరికీ బెంగాలీ వచ్చు కాబట్టి సమస్య రాలేదు. కానీ ఐపీఎల్ దగ్గరికి వచ్చే సరికి మాత్రం అతని గుండెల్లో రాయి పడింది. ఇంత సుదీర్ఘ సమయం పాటు అతను సొంత దేశపు ఆటగాళ్లు, వాతావరణంనుంచి ఎప్పుడూ దూరంగా లేడు. ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ఇలాంటి సందర్భాలు తరచుగా వస్తూనే ఉంటాయి.  కానీ మాతృభాష బెంగాలీ తప్ప ఇంగ్లీష్‌లో ఒక్క ముక్క కూడా రాకపోవడం అతని బాధను మరింత పెంచింది. ఆ భయంతోనే బయట ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా మ్యాచ్, ప్రాక్టీస్ లేని సమయంలో అతను హోటల్‌లోనే ఉండిపోయేవాడు. బెంగాలీ మాట్లాడేవారు పక్కన లేకపోతే అతను చాలా ఇబ్బందికి గురవుతాడు. అందుకే హైదరాబాద్‌లో పంజాబ్‌పై మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచినప్పుడు కూడా ప్రసారకర్తలు అతనితో మాట్లాడించలేకపోయారు. ఇలాంటి సమయంలో రికీ భుయ్ రూపంలో ముస్తఫిజుర్‌కు ఆపద్బాంధవుడు దొరికాడు. ఆంధ్ర క్రికెటర్ భుయ్‌కు తన కుటుంబ నేపథ్యం కారణంగా బెంగాలీ బాగా వచ్చు. ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని భుయ్, జట్టుకు ఫుల్‌టైమ్ 12వ ఆటగాడిగా, అనువాదకుడిగా పని చేశాడు.


సంకేత భాషలే...
ఆటకు భాషతో పనేముంది, క్రికెట్ విశ్వ భాష అంటూ ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. కానీ మ్యాచ్‌లో కీలక సమయంలో వ్యూహాలు రచించడానికి, తమ భావం సరిగ్గా వివరించేందుకు భాష కావాలి. హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేవలం ముస్తఫిజుర్ కోసం కొంత ప్రయత్నం కూడా చేశాడట. గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో బెంగాలీ పదాలను నేర్చుకోవాలని చూశాడు. కానీ అది సరిపోలేదు. దాంతో రైజర్స్ మేనేజ్‌మెంట్ ముస్తఫిజుర్ బాధ్యతను ఇక రికీ చేతుల్లో పెట్టేసింది. 2014 అండర్-19 ప్రపంచకప్ నాటినుంచి ముస్తఫిజుర్, భుయ్‌కు స్నేహం ఉంది. ‘టీమ్ సమావేశాల్లో ముస్తఫిజుర్‌కు ఎవరూ ఏమీ చెప్పరు. అంతా మ్యాచ్ జరిగే సమయంలోనే, ముఖ్యంగా టైమౌట్ సందర్భంగానే అతనికి తగిన సందేశం వెళుతుంది. తొలి పది ఓవర్లలో అయితే ఎలా బౌలింగ్ చేయాలి, తర్వాతి పది ఓవర్లలో ఏం చేయాలి, ఏ బ్యాట్స్‌మెన్‌కు ఎలా బంతి విసరాలి, దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సిద్ధం చేయడం ఇలా వార్నర్ చెప్పే ప్రతీ విషయాన్ని నేను స్ట్రాటజిక్ టైమౌట్ సమయంలోనే అతని దగ్గరికి వెళ్లి వివరిస్తాను. ఇంతే కాకుండా ఫిజ్ తన చేతులు ఊపుతూ సందేశాలతోనే తన భావం ఏమిటో మాకు చెప్పేస్తాడు’ అని రికీ భుయ్ వెల్లడించాడు. ఐపీఎల్ ఆరంభంతో పోలిస్తే ఇన్ని మ్యాచ్‌ల తర్వాత ఇప్పుడు ముస్తఫిజుర్‌తో సంభాషించే పరిస్థితి కాస్త మెరుగైందని కోచ్ మూడీ సరదాగా చెప్పారు.

 
ఇంటిపై బెంగతో...

చదువుల కోసమో, కోచింగ్ కోసమో విద్యార్థులను ఇంటికి దూరంగా హాస్టల్‌లో పెడితే ఎలా ఉంటుం దో ఇప్పుడు 21 ఏళ్ల ముస్తఫిజుర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మైదానంలో ఉన్నంత సేపు పూర్తిగా బౌలింగ్‌పైనే దృష్టి పెడతాడు.  ఆ తర్వాత మాత్రం నా ఊరు, నా ఇల్లు, కుటుంబ సభ్యులు, బ్యాక్‌గ్రౌండ్ ఇవే చెబుతుంటాడు. టైమ్ దొరికితే తన సోదరుడితో ఫోన్లో మాట్లాడుతుంటాడు. అతనికి స్వస్థలం ఎప్పుడు వెళ్లిపోదామా అని ఉంది. ఇప్పటికే చాలా బెంగ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది అని భుయ్ చెప్పాడు. అందుకే అతను కొద్ది రోజులు ఆటకు విరామం పెట్టి ఇంట్లో గడుపుదామని భావిస్తున్నాడు. మరో పర్యటన చేస్తే కుర్రాడు బెంగతోనే అనారోగ్యం పాలవుతాడని ఇంటివాళ్లు కూడా అంటున్నారు. ఇలాంటి హోం సిక్‌తో కూడా ముస్తఫిజుర్ ఐపీఎల్‌లో చెలరేగాడు. 15 మ్యాచ్‌లలో కేవలం 6.74 ఎకానమీతో అతను 16 వికెట్లు పడగొట్టాడు.  భాష రాకపోతేనేమి... బంతితోనే సత్తా చాటి లీగ్‌లో కొత్త స్టార్‌గా ముస్తఫిజుర్ ఆవిర్భవించడం విశేషం.   - సాక్షి క్రీడా విభాగం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement