డ్వేన్ బ్రేవో
ముంబై : రెండేళ్ల నిషేదం అనంతరం పునరాగమనం చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. అసలు సిసలు ఐపీఎల్ మాజాను తొలి మ్యాచ్‌తోనే అభిమానులకు రుచి చూపించింది. ముంబై ఇండియన్స్‌తో హోరాహోరీగా సాగిన పోరులో చెన్నై ఓటమి ఖాయమని కెప్టెన్ ధోనితో పాటు అందరూ భావించారు. అలాంటి స్థితి నుంచి ఒత్తిడిని జయించి ముంబైని సొంత గడ్డపైనే మట్టికరిపించి చెన్నై సత్తా ఎంటో చూపించాడు ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో(68, 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు). క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చి అబ్బుర పరిచిన ఈ విండీస్ ఆటగాడికే మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ వరించింది.
మ్యాచ్ అనంతరం బ్రేవో మాట్లాడుతూ.. ‘ఇది జట్టు గొప్ప ప్రయత్నం. ఈ విజయాన్ని చెన్నై అభిమానులకు అంకితం చేయాలనుకుంటున్నా. ఇలాంటి మధుర క్షణాల కోసం వారు ఎన్నో రోజులుగా వేచి చూశారు. తనవంతుగా మ్యాచ్ గెలుపు ప్రదర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నా. మ్యాచ్ గెలుపు కోసమే కృషి చేశా. ప్రతి బంతిని బౌండరీకి తరలించాలనుకున్నా. ఈ ప్రణాళికతో ఆ రెండు ఓవర్లలో పరుగులు రాబట్టా. అయితే చివర్లో అవుటవ్వడం నిరాశ కలిగించింది. అయినప్పటికి ఇది నా రోజు. టోర్నీ ఘనంగా ఆరంభించడం సంతోషంగా ఉంది.’ అని పేర్కొన్నాడు. స్టన్నింగ్ విక్టరీ అందించిన బ్రేవోపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముంబై విధించిన166 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.5 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి చేధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment