సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే లీగ్ టోర్నమెంట్‌లో ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో రైల్వేస్ జట్టు విజయంతో తమ లీగ్ మ్యాచ్‌లను ముగించింది. హిమాచల్‌ప్రదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వరుసగా నాలుగు విజయాలతో (16 పాయింట్లు) అజేయంగా రైల్వేస్ గ్రూప్ టాపర్‌గా నిలిచింది. స్థానిక ఏఓసీ గ్రౌండ్‌లో జరిగిన ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హిమాచల్‌ప్రదేశ్ 47.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. కేహెచ్ వర్మ (26), హెచ్‌బీ డియోల్ (27) పర్వాలేదనిపించారు. రైల్వేస్ బౌలర్లలో ఏక్తా బిష్త్ 5 వికెట్లతో చెలరేగింది. మోనా మేశ్రమ్, రాజేశ్వరి, సుకన్య, అరుంధతి తలా వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 110 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రైల్వేస్ జట్టు 31.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. నుజత్ పర్వీన్ (65 బంతుల్లో 34; 5 ఫోర్లు), ఎండీ తిరుష్ కామిని (50 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు.
ఆంధ్ర ఘనవిజయం
మరోవైపు ఆంధ్ర జట్టు మూడో విజయాన్ని సాధించింది. ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్‌లో మధ్యప్రదేశ్‌తో గురువారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఆంధ్ర 54 పరుగులతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 50 ఓవర్లలో 9 వికెట్లకు 224 పరుగులు చేసింది. ఝాన్సీ లక్ష్మి (95 బంతుల్లో 65; 5 ఫోర్లు), వి. పుష్పలత (70 బంతుల్లో 56; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఎన్. అనూష (53 బంతుల్లో 34; 4 ఫోర్లు) రాణించింది. అనంతరం మధ్యప్రదేశ్ జట్టు 39.5 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రుచిత (71 బంతుల్లో 58; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకుంది. ఆంధ్ర బౌలర్లలో మల్లిక 3 వికెట్లతో చెలరేగగా, ఝాన్సీలక్ష్మి, పద్మజ చెరో 2 వికెట్లు తీశారు. లీగ్ మ్యాచ్‌లు ముగిసేసరికి ఆంధ్ర జట్టు నాలుగు మ్యాచ్‌లకుగానూ మూడు గెలిచి 12 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ కేవలం ఒకే విజయాన్ని సాధించి 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment