
బట్లర్, రూట్ సెంచరీల మోత
న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు చెలరేగింది...
తొలి వన్డేలో ఇంగ్లండ్ 408/9
ఏడో వికెట్‌కు ప్రపంచ రికార్డు
బర్మింగ్‌హామ్: న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో ఇంగ్లండ్ జట్టు చెలరేగింది. రికార్డులతో హోరెత్తించింది. జాస్ బట్లర్ (105 బంతుల్లో 129; 13 ఫోర్లు, 5 సిక్సర్లు), జో రూట్ (78 బంతుల్లో 104; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగవంతమైన శతకాలతో కివీస్ బౌలర్లను చితక్కొట్టారు. దాంతో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 408 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలిసారి వన్డేల్లో 400 పరుగులు చేసిన ఇంగ్లండ్ తమ అత్యధిక స్కోరునూ నమోదు చేసింది.
ఇంగ్లండ్ గడ్డపై ఒక జట్టు 400 పరుగులు దాటడం కూడా ఇదే తొలిసారి. ఆదిల్ రషీద్ (50 బంతుల్లో 69; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ మోర్గాన్ (46 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) జట్టు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. బట్లర్, రషీద్ 177 పరుగులు జోడించి ఏడో వికెట్‌కు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దీంతో గతంలో ఆండీఫ్లవర్-హీత్ స్ట్రీక్ (జింబాబ్వే) పేరిట ఉన్న 130 పరుగుల రికార్డు కనుమరుగైంది. గతంలో ఇంగ్లండ్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ (61 బంతుల్లో) రికార్డు నెలకొల్పిన బట్లర్, ఇప్పుడు రెండో వేగవంతమైన శతకం (66 బంతుల్లో) చేయడం విశేషం. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (4/55) రాణించాడు. మెక్లీన్‌గన్ 10 ఓవర్లలో ఏకంగా 93 పరుగులు ఇచ్చాడు.