యాషెస్... సిరీస్ గెలిస్తే ఇచ్చే కప్పు పరిమాణంలో చిన్నదే అయినా, దాని ద్వారా వచ్చే పేరు ప్రఖ్యాతులు మాత్రం కొండంత! హీరోలను జీరోలుగా, అనామకులను అగ్రశ్రేణి ఆటగాళ్లుగా మార్చేసే శక్తి ఈ సిరీస్‌ది. జాతకాలను అమాంతం తారుమారు చేయగల స్థాయి దీని సొంతం. గతంలోకి ఒక్కసారి చూస్తే చాలు... ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఇంగ్లండ్–ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం జరుగుతున్న సిరీస్ సైతం ఇలాంటి అనూహ్యలకు వేదికవుతోంది. ఆ పరిణామం ఏమిటో చూస్తే...
సాక్షి క్రీడా విభాగం: గణాంకాలు 2–1గా ఉన్నా... పోటాపోటీలో గత సిరీస్‌లకు ఏమాత్రం తీసిపోకుండా సాగుతోంది ప్రస్తుత యాషెస్. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చూస్తే మాత్రం కొందరికి మరపురానిదిగా, మరికొందరికి చేదు జ్ఞాపకంగా మిగిలేలా ఉంది. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్. రికార్డుల పరంగా స్టీవ్ స్మిత్‌కు, చరిత్రలో నిలిచేందుకు కంగారూ కెప్టెన్ టిమ్ పైన్‌కు సువర్ణావకాశం ఇస్తోంది. కమిన్స్, లబషేన్ (ఆస్ట్రేలియా), స్టోక్స్ (ఇంగ్లండ్)ల ఆశావహ భవిష్యత్‌కు ఊపిరి పోస్తోంది.
బ్రాడ్ సుడి‘గండం’లో వార్నర్
బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఏడాది నిషేధం తర్వాత ఐపీఎల్, ప్రపంచ కప్‌లలో విశేషంగా రాణించిన వార్నర్... టెస్టుల్లో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు. ప్రేక్షకుల వెక్కిరింపులకు హుందాగానే బదులిస్తున్నా.. మ్యాచ్‌లో పరుగుల ఖాతా తెరవడానికే కష్టాలు పడుతున్నాడు. సిరీస్‌లో అతడు వరుసగా మూడుసార్లు డకౌటయ్యాడు. ఈ పరంపరలో వార్నర్ పాలిట ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ పెద్ద విలన్‌గా మారాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఆరుసార్లు బ్రాడ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. 2, 8, 3, 5, 61, 0, 0, 0.. ఇవీ వార్నర్ స్కోర్లు. దీంతో అతడికి ప్రాథమిక స్థాయి శిక్షణ అవసరమంటూ విమర్శలు వస్తున్నాయి. మరొకరైతే ఇవన్నీ నిర్దాక్షిణ్యంగా వేటు వేసేంతటి స్థాయి వైఫల్యాలు. వార్నర్ కాబట్టి మరొక్క అవకాశం అన్నట్లు వదిలేస్తున్నారు. ప్రొఫెషనలిజానికి పెట్టింది పేరైన ఆస్ట్రేలియా మాత్రం ఇకపై ఉపేక్షిస్తుందని భావించలేం. ఎందుకంటే వార్నర్‌తో పోలిస్తే మెరుగ్గానే ఆడుతున్నప్పటికీ వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఖాజాను పక్కనపెట్టింది ఆ జట్టు.
స్మిత్‌కు సుమధురం...
బాల్ ట్యాంపరింగ్‌తో విలువైన ఏడాది కాలాన్ని కోల్పోయిన స్మిత్ ఆ లోటును కసిదీరా తీర్చుకుంటున్నాడు. 142, 144, 92, 211, 82... యాషెస్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి పరుగులివి. మొత్తం కలిపితే 671. పరిస్థితుల రీత్యా ఔటయ్యాడు తప్పితే మొత్తం 5 సెంచరీలు తన ఖాతాలో ఉండేవి. స్టాన్స్ ఎలాగైనా ఉండనీ; ఆటంటే ఆటే కాబట్టి బ్రాడ్, ఆర్చర్ వంటి పేసర్లను తట్టుకుని స్మిత్ సాధించిన ఘనతలను ఏమాత్రం తక్కువ చేయలేం. మ్యాచ్ సందర్భంగా... ‘స్మిత్ ఏ గ్రహం నుంచి వచ్చాడు’; ‘మళ్లీ ఎప్పుడు తన గ్రహానికి వెళ్తాడు’ అంటూ సాగుతున్న సంభాషణలు నవ్వు తెప్పిస్తున్నా; అతడి ఆట అసాధారణం అని చెబుతున్నాయి.
‘రూట్’ కదులుతోందా?
57, 28, 14, 0, 0, 77, 71, 0... ఇవీ యాషెస్‌లో రూట్ స్కోర్లు. మొత్తం 247. సగటు తీస్తే 30కి కాస్త ఎక్కువ. స్మిత్ చేసిన పరుగుల్లో ముప్పై శాతం. స్మిత్ ఒక్క టెస్టులో చేసినంత కూడా కాదు. రూట్ వంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌కు ఏమాత్రం తగని ప్రదర్శన ఇది. చివరి 10 ఇన్నింగ్స్‌ల నుంచి సెంచరీనే లేదు. నిర్ణయ లోపాలతో జట్టును నడిపించడంలోనూ తడబడుతున్నాడు. కీలక సమయంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. దీంతో తనపై కెప్టెన్సీ భారం పడుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే బెన్ స్టోక్స్‌ను సారథిగా చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. వైఫల్యాల పరంపర కొనసాగితే... ఈ డిమాండ్ వాస్తవం అయ్యే అవకాశాలూ లేకపోలేదు.
స్టోక్స్... భలే కాలం
ఇంగ్లండ్‌లో ఇప్పుడు మార్మోగుతున్న పేరు బెన్ స్టోక్స్. ప్రపంచ కప్ ఫైనల్ నుంచి మొదలైన అతడి హవా యాషెస్ మూడో మూడో టెస్టులో అత్యద్భుత అజేయ సెంచరీతో పతాక స్థాయికి చేరింది. తమ దేశ దిగ్గజ ఆల్‌రౌండర్లు బోథమ్, ఫ్లింటాఫ్‌లతో పోలుస్తూ చివరకు అది... స్టోక్స్‌కు ‘సర్’ బిరుదు ఇవ్వాలని, ఉప్నపళంగా కెప్టెన్ చేయాలనే వరకు వెళ్లింది. ప్రస్తుత యాషెస్‌లో రెండు సెంచరీలు (115 నాటౌట్, 135 నాటౌట్) చేసిన ఏకైక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ ఒక్కడే. బౌలింగ్‌లోనూ ఫర్వాలేదనిపిస్తుండటంతో ప్రత్యర్థికి ఇంగ్లండ్ పోటీ ఇస్తోంది. గాయంతో బాధపడుతున్నా బ్యాటింగ్ కోసమైనా ఐదో టెస్టుకు కొనసాగించాలని చూడటం ఇంగ్లండ్ ఎంతగా స్టోక్స్‌పై ఆధారపడుతోందో చెబుతోంది.
పైన్‌కు సువర్ణావకాశం...
మామూలుగా పైన్‌కు ఆసీస్ జట్టులో చోటే కష్టం. పరిస్థితులు కెప్టెన్ చేశాయి. ఒకటీ, రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అవి ‘యాదృచ్చిక సారథి’ పేరును చెరపలేకపోయాయి. ఇప్పుడు మాత్రం గత 18 ఏళ్లలో ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ నెగ్గిన తొలి ఆసీస్ కెప్టెన్‌గా పైన్ చరిత్రలో నిలిచిపోయే సందర్భంలో ఉన్నాడు. ఐదో టెస్టులో నెగ్గకపోయినా సిరీస్ నిలుపుకొనే అవకాశం ఉండటం పైన్‌కు వ్యక్తిగతంగా మైలురాయే. మూడో టెస్టు చివర్లో బౌలర్లను మార్చే విషయంలో పైన్ నిర్ణయ లోపాలతో జట్టు ఓడింది. లేకుంటే ఇప్పటికే ఆసీస్ 3–0తో సిరీస్‌ను నెగ్గేదే. నాలుగో టెస్టులో బ్యాట్‌తో రాణించి వాటికి పైన్ సమాధానమిచ్చాడు. చివరి టెస్టులో ఆసీస్ గెలిస్తే చరిత్రకు ఎక్కడంతో పాటు పైన్ మరికొంత కాలం జట్టులో ఉండటం ఖాయం.
భలే లబషేన్...
సరిగ్గా నెల క్రితం మిగతా ప్రపంచానికి లబషేన్ ఓ సాధారణ ఆటగాడు. కానీ, రెండో టెస్టులో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి అర్ధసెంచరీ (59)తో జట్టును ఓటమి నుంచి గట్టెక్కించి హీరో అయిపోయాడు. ఆ తర్వాత వరుసగా మూడు అర్ధ సెంచరీ (74, 80, 67)లతో ‘ఇంగ్లండ్ పాలిట చిన్న స్మిత్’గా మారాడు. అతడి కోసం ఆస్ట్రేలియా ఉస్మాన్ ఖాజానూ తప్పించింది. నాలుగో టెస్టు డ్రా అవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్న సమయంలో జాక్ లీచ్‌ను ఔట్ చేసిన లబషేన్ మ్యాచ్‌నే మలుపు తిప్పాడు. ఇకపై జట్టులో అతడు రెగ్యులర్ సభ్యుడు అనడంలో అనుమానం లేదు.
ఇతర ఆటగాళ్ల విషయానికొస్తే... మున్ముందు ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ తానేనని; ప్రపంచ స్థాయి బౌలర్ అవుతానని కమిన్స్ (4 టెస్టుల్లో 24 వికెట్లు) మరోసారి చాటాడు. గాయాలతో ఇబ్బందిపడుతున్నందున మిషెల్ స్టార్క్‌ను విస్మరించలేకున్నా కమిన్స్ ప్రతిభను తీసిపడేయలేం. నాలుగో టెస్టులో రూట్‌ను డకౌట్ చేసిన బంతే దీనికి నిదర్శనం. ‘ఓ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌కు కుడిచేతి వాటం బౌలర్ సంధించిన అత్యుత్తమ బంతి’గా నిపుణులు దీనిని కొనియాడారు.
వయసు (33) రీత్యా కెరీర్‌పై స్పష్టంగా చెప్పలేకున్నా ఇంగ్లండ్ పేసర్ బ్రాడ్ యాషెస్‌లో (19 వికెట్లు) మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. సహచరుల తోడ్పాటు లేక ఆ విలువ తెలియడం లేదు. బ్యాట్స్‌మెన్‌లో రాయ్‌ను ప్రపంచ కప్ ప్రదర్శన ఆధారంగా టెస్టులకు తీసుకొస్తే పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. ఓపెనింగ్ నుంచి నంబర్ 4కు మార్చినా ప్రయోజనం లేకపోతోంది. భవిష్యత్‌లో రాయ్‌కు టెస్టు పిలుపు ఉంటుందని ఊహించలేం. వరుస వైఫల్యాలు బట్లర్, బెయిర్ స్టోలలో ఎవరో ఒకరి స్థానానికి చేటు తెచ్చేలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment