వరల్డ్ కప్ ఫైనల్: టాస్ ఓడిన భారత్
లార్డ్స్:మహిళల వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న తుదిపోరులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్ హీథర్ నైట్ టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ వైపు మొగ్గుచూపింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత్ కు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యాన్ని నిర్దేశించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించి మూల్యం చెల్లించుకుంది. ఆ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 282 లక్ష్యాన్ని నిర్దేశించి విజయం సాధించింది. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ తీసుకుంది.
ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్‌లు పోరాటంలో సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఇరు జట్ల క్రికెటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లూ అదరగొడుతున్నారు. ఫీల్డింగ్‌లో మాత్రం భారత్ కాస్తా వెనుకబడివున్నా... మరీ అంత పేలవంగా లేదు. పైగా ఈ టోర్నీలోనే ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి శుభారంభం చేసిన మిథాలీ సేన ఇప్పుడు మళ్లీ ఆ జట్టుపైనే గెలిచి ప్రపంచకప్‌తో శుభం కార్డు వేయాలని భావిస్తోంది. మరి ఈసారి భారత మహిళలు వరల్డ్ కప్ గెలిచి కొత్త చరిత్ర సృప్టిసారో లేదో చూడాలి.