ఈసారి వదలొద్దు! | History awaits India in Women's World Cup final | Sakshi
Sakshi News home page

ఈసారి వదలొద్దు!

Published Sun, Jul 23 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

ఈసారి వదలొద్దు!

ఈసారి వదలొద్దు!

కప్ తే ఇండియా...
ఇంగ్లండ్‌తో నేడు మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌
సూపర్‌ ఫామ్‌లో రెండు జట్లు  


నాలుగున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో చివరిసారి భారత్‌ ఫైనల్‌ చేరి సరిగ్గా పుష్కర కాలమైంది. 2005లో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన ఈ మెగా ఈవెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి మిథాలీ రాజ్‌ సారథ్యంలోనే టీమిండియా టైటిల్‌ పోరుకు చేరింది. అయితే ఆస్ట్రేలియా ధాటికి భారత్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సీన్‌ కట్‌ చేస్తే... మళ్లీ ఇప్పుడు ప్రపంచకప్‌ టైటిల్‌ కోసం ఇంగ్లండ్‌తో తేల్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది.

నాడు, నేడు మిథాలీనే కెప్టెన్‌. కానీ ఈసారి మాత్రం ‘కప్‌’ను వదలొద్దు. ఆతిథ్య జట్టును హడలెత్తించాలని... కొత్త     చాంపియన్‌గా అవతరించాలని... కప్‌తో స్వదేశం తిరిగి రావాలని... కోట్లాది మంది అభిమానుల ఆకాంక్ష. తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌ అంతిమ సమరంలోనూ అదే జట్టును మళ్లీ మట్టికరిపించాలని ఆశిస్తూ... ఆల్‌ ది బెస్ట్‌... టీమిండియా... కప్‌తే ఇండియా!

లండన్‌: 1983... అంటే ఠక్కున గుర్తొచ్చేది కపిల్‌ డెవిల్స్‌ ‘షో’నే. భారత్‌ క్రికెట్‌ ప్రగతికది తొలి సోపానం. ఎంత చెప్పుకున్నా... ఏం రాసుకున్నా... ఆ చారిత్రక విక్టరీ ఎప్పటికీ ప్రత్యేకమే. సరిగ్గా ఇప్పుడు కూడా మరో చరిత్రకు మళ్లీ ‘లార్డ్స్‌’ వేదికైంది. అçప్పుడు పురుషుల జట్టును హీరోలని చేస్తే... ఇప్పుడు మహిళల జట్టును ‘క్వీన్స్‌’గా చేస్తుందేమో వేచి చూడాలి. అదే జరిగితే లార్డ్స్‌... వన్డే ప్రపంచకప్‌ల్లో ‘నాయక నాయిక’ (కపిల్, మిథాలీ)లను అందించిన స్టేడియంగా భారత క్రికెట్‌లో చిరకాలం నిలిచిపోతుంది. ఈ మెగా టోర్నీ చరిత్రలో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన 2005లో రన్నరప్‌. అప్పుడు ఆడిన జట్టులో మిథాలీ, జులన్‌ గోస్వామి మాత్రమే సభ్యులు. మిగతా వారికి ఇదే తొలి ఫైనల్‌. అయినా పోరాటపటిమలో అందరూ ఆకట్టుకుంటు న్నారు. దీంతో భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఆదివారం ఆసక్తికర పోరు జరగనుంది.

ఢీ అంటే ఢీ...
ఈ మెగా టోర్నీలో భారత్, ఇంగ్లండ్‌లు పోరాటంలో సమఉజ్జీలుగా ఉన్నాయి. బ్యాటింగ్‌లో ఇరు జట్ల క్రికెటర్లు భీకర ఫామ్‌లో ఉన్నారు. బౌలర్లూ అదరగొడుతున్నారు. ఫీల్డింగ్‌లో మాత్రం భారత్‌ కాస్తా వెనుకబడివున్నా... మరీ  అంత పేలవంగా లేదు. పైగా ఈ టోర్నీలోనే ఆతిథ్య ఇంగ్లండ్‌పై గెలిచి శుభారంభం చేసిన మిథాలీ సేన ఇప్పుడు మళ్లీ ఆ జట్టుపైనే గెలిచి ప్రపంచకప్‌తో శుభం కార్డు వేయాలని భావిస్తోంది. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అందరికంటే స్థిరంగా ఆడుతోంది. 392 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నప్పటికీ... ఎలీస్‌ పెర్రీ (ఆస్ట్రేలియా–404 పరుగులు)ని అధిగమించేందుకు కేవలం ఆమె 12 పరుగుల దూరంలోనే ఉంది.

ఇక హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో లీగ్‌ మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ల్లో తెగువ చూపింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో చావోరేవో మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో, సెమీస్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాపై చరిత్రకెక్కే అజేయ భారీ సెంచరీతో అదరగొట్టింది. నెట్స్‌లో ఆమె గాయపడినట్లు జట్టు వర్గాలు తెలిపాయి. కానీ కంగారు పడాల్సిన పనిలేదని మిథాలీ స్పష్టం చేసింది. ఫామ్‌ కోల్పోయిన ఓపెనర్‌ స్మృతి మంధన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పైనే 90 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌పై తన ప్రదర్శనను పునరావృతం చేస్తే భారత్‌కు ఢోకా ఉండదు. వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, పూనమ్‌ రౌత్‌లు కూడా మంచి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసివచ్చే అంశం. బౌలింగ్‌లో దీప్తి శర్మ, జులన్‌ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండేలు నిలకడగా రాణిస్తున్నారు.

ఆల్‌రౌండ్‌ టీమ్‌ ఇంగ్లండ్‌...
ఇంగ్లండ్‌ ఈ టోర్నీలో ఒకే ఒక్కసారి అది కూడా భారత్‌ చేతిలో ఆరంభ మ్యాచ్‌లోనే ఓడింది. ఆ తర్వాత వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. బ్యాటింగ్‌లో టామీ బీమోంట్‌ (387 పరుగులు), కెప్టెన్‌ హీథెర్‌ నైట్‌ (363), సారా టేలర్‌ (351) అసాధారణ ఫామ్‌లో ఉన్నారు. అజేయ విజయాలకు వీరి ఇన్నింగ్స్‌లే వెన్నెముకగా నిలిచాయి. ఇక బౌలింగ్‌లో అలెక్స్‌ హార్ట్‌లీ, హీథెర్‌ నైట్‌  ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్‌ చివరిదాకా సాగినా... ఒత్తిడి లేకుండా గెలిచింది ఆల్‌రౌండ్‌ నైపుణ్యంతోనే. ఫీల్డింగ్‌లో భారత్‌కంటే ఇంగ్లండే మెరుగ్గా ఉంది.

జట్లు (అంచనా):
భారత్‌: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), పూనమ్‌ రౌత్, స్మృతి మంధన, హర్మన్‌ప్రీత్‌ కౌర్, దీప్తిశర్మ, వేద కృష్ణమూర్తి, సుష్మా వర్మ, శిఖాపాండే, జులన్‌ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్‌ యాదవ్‌/ఏక్తా బిష్త్‌.

ఇంగ్లండ్‌: హీథెర్‌ నైట్‌ (కెప్టెన్‌), బీమోంట్, లారెన్‌ విన్‌ఫీల్డ్, సారా టేలర్, నటాలీ సైవర్, ఫ్రాన్‌ విల్సన్, బ్రంట్, జెన్నీ గన్, లౌరా మార్‌‡్ష, ష్రబ్‌సోల్, అలెక్స్‌ హార్ట్‌లీ.

ముఖాముఖి
భారత్‌పై ఇంగ్లండ్‌దే పైచేయి. ఓవరాల్‌గా ఇరు జట్లు ఇప్పటివరకు 62 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ 26 మ్యాచ్‌లు గెలిస్తే... ఇంగ్లండ్‌ 34 విజయాలు సాధించింది. రెండింటిలో ఫలితం రాలేదు. భారత్‌ అత్యధిక స్కోరు 281 అయితే, ఇంగ్లండ్‌ అత్యధిక స్కోరు 272. ఇక ప్రపంచకప్‌ చరిత్రలో ఈ రెండు జట్లు 10 సార్లు తలపడగా... భారత్‌ నాలుగు మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌ ఆరు మ్యాచ్‌ల్లో గెలిచాయి. లార్డ్స్‌ మైదానంలో ఈ రెండు జట్లు మూడుసార్లు తలపడగా... చెరో మ్యాచ్‌లో గెలిచాయి. మరో మ్యాచ్‌ రద్దయింది.

పిచ్, వాతావరణం
పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. చిరుజల్లులు కురిసే అవకాశముంది. కానీ మ్యాచ్‌ను ప్రభావితం చేసేంత వాన ముప్పయితే లేదు. పైగా రిజర్వ్‌ డే (24, సోమవారం) కూడా ఉంది.

ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు
ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన భారత మహిళల క్రికెట్‌ జట్టుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నజరానా ప్రకటించింది. జట్టులోని సభ్యులందరికీ రూ. 50 లక్షల చొప్పున... సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని తెలిపింది.  

1 కెప్టెన్‌ హోదాలో రెండోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతున్న తొలి భారతీయ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌.

‘మెగా’ చరిత్రలో...
భారత్‌ ఒకసారి (2005లో) ఫైనల్‌ చేరి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇంగ్లండ్‌ మాత్రం 3 సార్లు (1973, 1993, 2009) విజేతగా గెలిచింది.

హౌస్‌ఫుల్‌...
నేడు జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్‌ను లార్డ్స్‌ మైదానంలో ప్రత్యక్షంగా 26,500 మంది ప్రేక్షకులు తిలకించనున్నారు. భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య డెర్బీ మైదానంలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌ కూడా హౌస్‌ఫుల్‌ అయింది. అయితే డెర్బీ గ్రౌండ్‌లో ప్రేక్షకుల సామర్థ్యం 3,100 మాత్రమే.

భారత్‌తో ఆరంభమ్యాచ్‌లో ఓడాం. వారితో ఇప్పుడు ఆడేది ఈ జట్టే అయినా... టోర్నమెంట్‌ జరుగుతున్న కొద్దీ మెరుగయ్యాం. మా వాళ్లంతా టచ్‌లోకి వచ్చారు. ఒకటో నంబర్‌ నుంచి 11వ నంబర్‌ వరకు అందరూ ఫామ్‌లోకి వచ్చారు. ఇలాంటి జట్టుకు సారథ్యం వహించడం ఆనందంగా ఉంది. – హీథెర్‌ నైట్‌ (ఇంగ్లండ్‌ కెప్టెన్‌)

ఒత్తిడిని ఎదుర్కోవడమే అసలైన సవాల్‌. క్లిష్టమైన ఓవర్లలో ఎవరైనా కుదురుగా నిలబడితే... అక్కడి నుంచి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కీలక మలుపు అవుతుంది. మా వాళ్లలో ఒకరిద్దరికి మినహా అందరికీ ఇదే తొలి ఫైనల్‌ అయినా... కంగారేమీ లేదు. సవాళ్లకు సిద్ధంగా ఉన్నారంతా. 2005లో తలపడిన జట్టుకు ఈ జట్టుకు పోలికేలేదు. ఈసారి తప్పకుండా రాణిస్తాం. – మిథాలీరాజ్‌ (భారత కెప్టెన్‌)

మిథాలీ సేనకు అర్జున్‌ బౌలింగ్‌
లండన్‌: వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో ఉన్న భారత మహిళల జట్టుకు అనుకోని అతిథి బౌలింగ్‌ చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ శనివారం ‘స్పెషల్‌’ నెట్స్‌ బౌలర్‌గా మారాడు. లెఫ్టార్మ్‌ పేసర్‌ అయిన ఈ జూనియర్‌ టెండూల్కర్‌ లార్డ్స్‌ గ్రౌండ్‌లో కఠోరంగా చెమటోడ్చుతున్న భారత మహిళల జట్టుకు బౌలింగ్‌ చేశాడు. పలువురు బ్యాట్స్‌మెన్‌ అతని పేస్‌ బౌలింగ్‌లో చక్కగా ప్రాక్టీస్‌ చేశారు. ముఖ్యంగా హిట్టర్‌ వేద కృష్ణమూర్తి... అర్జున్‌ బౌలింగ్‌లో భారీ షాట్లు కొట్టింది. నెట్స్‌ బౌలర్‌గా అర్జున్‌కు ఇదేం కొత్తకాదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు కూడా ఇంగ్లండ్‌ పురుషుల జట్టుకు ఉత్సాహంగా బౌలింగ్‌ చేశాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న అర్జున్‌ లార్డ్స్‌ మైదానంలోని మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)లో శిక్షణ తీసుకుంటున్నాడు.  

మధ్యాహ్నం   గం. 2.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్షప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement