సెరెనా సులువుగా...
రెండో రౌండ్‌లోకి ప్రవేశం
యూఎస్ ఓపెన్ టోర్నీ
న్యూయార్క్: పలు రికార్డులపై గురి పెట్టిన మహిళల టెన్నిస్ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో ప్రపంచ 29వ ర్యాంకర్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 12 ఏస్‌లు సంధించడంతోపాటు 27 విన్నర్స్ కొట్టింది. మరోవైపు సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ (అమెరికా) శ్రమించి తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. కొజ్లోవా (ఉక్రెరుున్)తో జరిగిన మ్యాచ్‌లో వీనస్ 6-2, 5-7, 6-4తో విజయం సాధించింది.
ముర్రే మెరిసె...
పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత ముర్రే తొలి రౌండ్‌లో 6-3, 6-2, 6-2తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... వావ్రింకా 7-6 (7/4), 6-4, 6-4తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెరుున్)పై గెలుపొందాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ నిషికోరి (జపాన్) 6-1, 6-1, 3-6, 6-3తో బెకర్ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్టియ్రా) 6-3, 2-6, 5-7, 6-4, 6-3తో మిల్‌మన్ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. 12వ సీడ్ గాఫిన్ (బెల్జియం), 17వ సీడ్ టామిక్ (ఆస్ట్రేలియా), 29వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) తొలి రౌండ్‌లో ఓడిపోయారు.
కార్లోవిచ్ ‘ఏస్’ల రికార్డు...
యూఎస్ ఓపెన్‌లో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు కొట్టిన ప్లేయర్‌గా ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా) రికార్డు సృష్టించాడు. యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కార్లోవిచ్ ఏకంగా 61 ఏస్‌లు సంధించాడు. దాంతో 49 ఏస్‌లతో 1999లో రిచర్డ్ క్రారుుసెక్ (నెదర్లాండ్‌స) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ 3 గంటల 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 4-6, 7-6 (7/4), 6-7 (4/7), 7-6 (7/5), 7-5తో విజయం సాధించాడు. టెన్నిస్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ఏస్‌లు కొట్టిన ప్రపంచ రికార్డు జాన్ ఇస్నెర్ (అమెరికా) పేరిట ఉంది. నికొలస్ మహుట్ (ఫ్రాన్‌స)తో జరిగిన 2010 వింబుల్డన్ తొలి రౌండ్‌లో ఇస్నెర్ 113 ఏస్‌లు కొట్టాడు.