![Expecting Andre Russell to deliver everytime unfair, says Karthik - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/6/dinesh-karthik.jpg.webp?itok=-rhyY3uV)
ముంబై: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కథ లీగ్ దశలోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ప్లేఆఫ్ అవకాశాలు మూసుకుపోయాయి. ప్రతి మ్యాచ్‌లో మాదిరిగానే ఈసారి కూడా ఆండ్రీ రసెల్.. కేకేఆర్‌ను ఆదుకుంటాడని భావించారంతా. ఈ ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షంలో క్రికెట్ అభిమానులను తడిపేసిన రసెల్‌పై ఆ స్థాయి అంచనాలే నెలకొన్నాయి. కానీ తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రసెల్ చేతులెత్తేశాడు. పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. అయితే ఈ మ్యాచ్ ఓటమిపై కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు.
‘రసెల్ బ్యాటింగ్ చేయడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ ప్రతి మ్యాచ్‌ను అతడే గట్టెక్కిస్తాడనుకోవడం బాగోదు. అతడి మీద ఆధార పడటం కూడా పద్ధతి కాదు. ప్రతీసారి రసెల్‌పై ఆధారపడితే ఎలా. ఈ టోర్నమెంట్ మొత్తంలో రసెల్ ఆట అద్భుతం. ఈ సీజన్ మాకు అంత బెస్ట్ కాదనుకుంటా. ఐపీఎల్ ఒక వినోదాత్మకమైన టోర్నమెంట్. ప్రతిరోజు మేం మా సామర్థ్యం మేరకు పనిచేయడానికి ప్రయత్నిస్తాం. అందరి అంచనాలు అందుకోవాలంటే ముందుగా మేం కొన్నింట్లో మెరుగుపడాలి. వచ్చే ఏడాది మరింత బలంతో, ఆత్మవిశ్వాసంతో ఐపీఎల్‌లో అడుగుపెడతాం’ అని కార్తిక్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment