న్యూఢిల్లీ: దేశంలో క్రీడా రంగ ప్రగతికి నిధులు ఇచ్చేందుకు కార్పొరేట్ రంగం సిద్ధంగానే ఉందని, వాటిని పారదర్శకంగా ఖర్చు చేస్తున్నామని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లు హామీ ఇవ్వాలని కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అన్నారు. ‘నిధుల కోత గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. ఇది మా పరిధిలోనిదే. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇచ్చేందుకు సిద్ధం. కానీ... సమాఖ్యలు సొంతంగా నిలదొక్కుకోవాలన్నదే మా ఆలోచన. లీగ్‌ల ద్వారా రెజ్లింగ్, హాకీ, బ్యాడ్మింటన్ సమాఖ్యలు డబ్బు సమీకరిస్తున్నాయి.
అయినా వీటికి కేంద్రం సాయం చేస్తోంది కదా?’ అని చెప్పుకొచ్చారు. ప్రతిపాదిత ‘జాతీయ క్రీడాభివృద్ధి నియమావళి’ వ్యవస్థలో భారీ మార్పులు తీసుకొచ్చేదిగా ఉంటుందని మంత్రి వివరించారు. సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్తాన్‌ను అనుమతించడాన్ని కాలమే నిర్ణయిస్తుందని రాజ్యవర్ధన్ అన్నారు. కామన్వెల్త్ పోటీల్లో భారత క్రీడాకారులు ఎన్ని పతకాలు గెలవగలరన్న సంఖ్యను చెప్పేందుకు ఇష్టపడని మంత్రి... సన్నాహాలకు చక్కటి వసతులు సమకూర్చుతున్నామని, దేశ ప్రతినిధులుగా వారు క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment