
మాకు పోయేదేం లేదు
ఈ దృక్పథంతోనే ఆడతాం
స్వదేశంలో ప్రపంచకప్‌లో ఒత్తిడి సహజం
కొన్ని ఓటములు బాధిస్తాయి
షకీబ్ అల్ హసన్ ఇంటర్వ్యూ
బంగ్లాదేశ్ క్రికెట్‌లో అతి పెద్ద స్టార్ షకీబ్ అల్ హసన్. టి20 క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు. నిజానికి భారత్ లాంటి పెద్ద జట్టులో అయినా స్థానం సంపాదించుకోగల నైపుణ్యం తన సొంతం. అందుకే షకీబ్ పేరు వింటే బంగ్లాదేశ్ ఊగిపోతుంది. ఇక స్వదేశంలో తనమీద ఎన్నో అంచనాలు. అయితే భారత క్రికెటర్ల తరహాలో ఇవన్నీ అలవాటయ్యాయంటున్నాడు షకీబ్.
ఢాకా నుంచి బత్తినేని జయప్రకాష్
అతిశయోక్తిలా అనిపిస్తుందేమో గానీ... భారత్‌లో సచిన్‌కు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో, బంగ్లాదేశ్‌లో షకీబ్‌కూ అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. అతని పేరు వినిపిస్తేనే ఊగిపోతున్నారు. అతను ఆడుతుంటే బిజీగా ఉండే ఢాకా రోడ్లు ఖాళీ అయిపోతున్నాయి. అంత స్టార్‌డమ్ ఉన్నా షకీబ్ నేల మీదే ఉన్నాడు. అందరినీ మర్యాదగా పలకరిస్తాడు. ఓ గొప్ప క్రికెటర్‌తో పాటు మంచి మనిషిగా కూడా బంగ్లాదేశ్ క్రికెట్ సర్కిల్‌లో పేరు తెచ్చుకున్న షకీబ్ వివిధ అంశాలపై చెప్పిన విశేషాలు...
బంగ్లాదేశ్‌లో
టి20 ప్రపంచకప్...
మా అందరికీ గొప్ప అవకాశం. ఇలాంటి టోర్నీలు బాగా నిర్వహించడం వల్ల క్రికెట్‌కు ఇంకా క్రేజ్ పెరుగుతుంది. 2011 వన్డే ప్రపంచకప్ నిర్వహణ ద్వారా బంగ్లాదేశ్ స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ ప్రపంచకప్ కూడా విజయవంతంగా నడుస్తోంది. ఏ రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు జరిగినా అభిమానులు బాగా వస్తున్న సంగతి గమనించే ఉంటారు. నాణ్యమైన క్రికెట్‌ను బంగ్లా అభిమానులు ఎప్పుడూ ఆదరిస్తారు.
ఇలాంటి టోర్నీలో ఒత్తిడి...
దేశం తరఫున ఏ మ్యాచ్‌లో ఆడినా ఏ క్రికెటర్‌కైనా ఒత్తిడి ఉండటం సహజం. ముఖ్యంగా ఉపఖండంలో అన్ని జట్లదీ ఇదే పరిస్థితి. భారత్ క్రికెటర్ల తరహాలోనే మాకు కూడా అంచనాలు, ఒత్తిడీ అలవాటయ్యాయి.
క్లిష్టమైన గ్రూప్‌లో ఆడటం
నిజాయతీగా చెప్పాలంటే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో, ఈ దశలో (సూపర్-10) అన్నీ పెద్ద జట్లే ఉంటాయి. నాలుగు ప్రపంచ చాంపియన్ జట్లతో ఆడటం కచ్చితంగా క్లిష్టమైన ప్రక్రియే. అయితే ఏ మ్యాచ్‌లో అయినా మా పూర్తి సామర్థ్యంతో ఆడటం ముఖ్యం. ఈ జట్ల చేతిలో ఓడినా మాకు పోయేదేం లేదు. స్వదేశంలో ప్రపంచకప్ మ్యాచ్ ఆడటం మరింత ఒత్తిడితో కూడుకున్న అంశం.
స్పిన్ బలం
టోర్నీలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి మా జట్టు బలంగా ఉందనే అనుకోవాలి. మా జట్టులో కనీసం నలుగురు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో మాత్రం మేం బాగా మెరుగుపడాలి.
హాంకాంగ్ చేతిలో ఓటమి
కొన్నిసార్లు కొన్ని ఓటములను జీర్ణించుకోలేం. బాగా బాధ కలిగిస్తాయి. హాంకాంగ్ చేతిలో ఓటమి కూడా అలాంటిదే. మా చేతిలో పాకిస్థాన్ లేదా భారత్ లాంటి జట్టు ఓడిపోయినప్పుడు ఆ జట్టు క్రికెటర్లు కూడా ఇలాగే అనుకుంటారేమో.
ఇటీవల కాలంలో అభిమానులకు ఇచ్చిన సందేశం
మేం గెలిస్తే ఆకాశానికి ఎత్తుతారు. ఓడిపోయినప్పుడు తిడతారు. ఇది మా దగ్గర సహజం. మా దగ్గర నుంచి మంచి ఆటను ఆశిస్తారు. ఇలాంటి పెద్ద టోర్నీలో టైటిల్ గెలవాలనే అంచనా కరెక్ట్ కాదు. అభిమానులకు ఇదే చెప్పాను. ఎలాంటి అంచనాలు లేకుండా ఆటను ఆస్వాదించాలని కోరాను.