
నేలకు దించారు !
అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్‌లో....
‘మా జట్టులో ఎలాంటి సమస్యలు లేవు. కేవలం పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం ఒక్కటే మేం చేయాల్సింది. కచ్చితంగా ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ ఆడతాం’ ముక్కోణపు సిరీస్‌కు ముందు భారత కెప్టెన్ ధోని చేసిన వ్యాఖ్య లు ఇవి. కానీ వారం కూడా తిరగకముందే ఊహల్లో తేలిపోతున్న టీమిండియాను ఇంగ్లండ్ దెబ్బకు నేలకు దించింది. మన జట్టులో ఎన్ని లొసుగులు ఉన్నాయో తెలియజేస్తూ కెప్టెన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది.
మనం బలంగా భావించే ప్రతీ అంశాన్ని బలహీనం చేసి చూపెడుతూ తలలు పట్టుకునేలా చేసింది. నెల రోజులు కూడా లేని ప్రపంచకప్‌కు ఎలా సన్నద్ధం కావాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లోకి ధోనిసేనను నెట్టింది. ఓవరాల్‌గా సమష్టి ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్ ‘బోనస్’ విజయం తో ముక్కోణపు సిరీస్‌లో బోణీ చేయగా... ఆసీస్ టూర్‌లో తొలి గెలుపు కోసం టీమిండియా కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తోంది.
బ్రిస్బేన్: అలసట, ఆత్మ విశ్వాసం సన్నగిల్లడంతో ఏడాది కిందట ఇదే మైదానంలో ఆసీస్ పర్యటన నుంచి అర్ధంతరంగా తప్పుకున్న స్టీవెన్ ఫిన్ (5/33) మళ్లీ ఇప్పుడు అదే గ్రౌండ్‌లో తన సత్తా ఏంటో చూపాడు. గబ్బా వికెట్‌పై సహజ సిద్ధంగా ఉండే బౌన్స్‌ను అందిపుచ్చుకున్న ఈ పేసర్ ముక్కోణపు సిరీస్‌లో భారత్‌ను వణికించాడు. సహచరుడు అండర్సన్ (4/18) కూడా తోడు కావడంతో నిప్పులు చెరిగే బంతులతో ధోని సేన భరతం పట్టారు.
ఫలితంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. స్టువర్ట్ బిన్నీ (55 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ధోని (61 బంతుల్లో 34; 1 ఫోర్), రహానే (40 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 27.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 156 పరుగులు చేసి నెగ్గింది. బెల్ (91 బంతుల్లో 88 నాటౌట్; 8 ఫోర్లు), టేలర్ (63 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. బిన్నీకి ఒక్క వికెట్ దక్కింది. ఫిన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 26న సిడ్నీలో భారత్... ఆసీస్‌తో తలపడుతుంది.
ఏ దశలోనూ కోలుకోలేదు
రోహిత్‌కు గాయం, అదనంగా పేసర్ కావాలనే ఆలోచనతో భారత్ ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఈసారి కూడా ఓపెనర్లు శుభారంభాన్నివ్వలేకపోయారు. పేవలమైన షాట్‌తో ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ధావన్ (1) అవుటయ్యాడు. తర్వాత రహానే, రాయుడు (53 బంతుల్లో 23; 2 ఫోర్లు) కూడా ఇంగ్లిష్ పేసర్లను ఆడటంలో బాగా ఇబ్బంది పడ్డారు. దీంతో తొలి 10 ఓవర్లలో కేవలం 36 పరుగులు మాత్రమే వచ్చాయి. ఎక్స్‌ట్రా బౌన్స్‌ను రాబట్టడంలో సఫలమైన ఫిన్ 15వ ఓవర్‌లో రహానేను వెనక్కి పంపాడు.
తన తర్వాతి ఓవర్ (17వ)లోనే కోహ్లి (4)ని కూడా అవుట్ చేసి భారత్‌కు షాకిచ్చాడు. తర్వాతి వరుస ఓవర్లలో రైనా (1), రాయుడు అవుట్ కావడంతో భారత్ 67 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ధోని, బిన్నీ సమయోచితంగా ఆడటంతో ఇన్నింగ్స్ కాస్త గాడిలో పడింది. 36వ ఓవర్‌లో ధోని క్యాచ్‌ను అండర్సన్ మిస్ చేశాడు. కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో కెప్టెన్ విఫలమయ్యాడు.
తర్వాతి ఓవర్‌లోనే ఫిన్ తన తొలి రెండు బంతులకు ధోని, అక్షర్ (0)లను అవుట్ చేశాడు. బిన్నీ, ధోనిలు ఆరో వికెట్‌కు 17.1 ఓవర్లలో 70 పరుగులు జోడించారు. తన వన్డే కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసిన ఘనతను ఫిన్ అందుకున్నాడు. తర్వాత అండర్సన్ 13 బంతుల వ్యవధిలో బిన్నీ, భువీ, షమీ(1)లను అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆడుతూ పాడుతూ...
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఆరంభం నుంచే ఓపెనర్ బెల్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీ షాట్ కోసం వెళ్లి మొయిన్ అలీ అవుటైనా... కొత్త కుర్రాడు జేమ్స్ టేలర్ సహకారంతో బెల్ ఇంగ్లండ్‌కు ఘన విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) టేలర్ (బి) ఫిన్ 33; ధావన్ (సి) బట్లర్ (బి) అండర్సన్ 1; రాయుడు (సి) బట్లర్ (బి) ఫిన్ 23; కోహ్లి (సి) బట్లర్ (బి) ఫిన్ 4; రైనా (స్టంప్డ్) బట్లర్ (బి) అలీ 1; ధోని (సి) బట్లర్ (బి) ఫిన్ 34; బిన్నీ (సి) మోర్గాన్ (బి) అండర్సన్ 44; అక్షర్ (బి) ఫిన్ 0; భువనేశ్వర్ (బి) అండర్సన్ 5; షమీ (సి) అలీ (బి) అండర్సన్ 1; ఉమేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (39.3 ఓవర్లలో ఆలౌట్) 153.
వికెట్ల పతనం: 1-1; 2-57; 3-64; 4-65; 5-67; 6-137; 7-137; 8-143; 9-153; 10-153.
బౌలింగ్: అండర్సన్ 8.3-2-18-4; వోక్స్ 7-0-35-0; బ్రాడ్ 7-0-33-0; ఫిన్ 8-0-33-5; మొయిన్ అలీ 9-0-31-1
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: బెల్ నాటౌట్ 88; అలీ (సి) కోహ్లి (బి) బిన్నీ 8; టేలర్ నాటౌట్ 56; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (27.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 156; వికెట్ల పతనం: 1-25.
బౌలింగ్: బిన్నీ 7-0-34-1; భువనేశ్వర్ 2-0-18-0; ఉమేశ్ 6-0-42-0; షమీ 4-0-23-0; అక్షర్ పటేల్ 7.3-0-32-0; రైనా 1-0-7-0.
153 వన్డేల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతి తక్కువ స్కోరు. 1996లో హెడ్డింగ్లీలో భారత్ 158 పరుగులు చేసింది.
18 పద్దెనిమిది ఏళ్ల తర్వాత తటస్థ వేదికపై ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడటం ఇదే మొదటిసారి. 1997లో షార్జాలో టీమిండియా ఓడింది.
135 మిగిలి ఉన్న బంతుల పరంగా భారత్‌పై ఇంగ్లండ్‌కు ఇదే పెద్ద గెలుపు. వికెట్ల పరంగా చూస్తే ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద విజయం కూడా.
4 ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు ఇంగ్లిష్ బౌలర్లు నాలుగు కంటే ఎక్కువగా వికెట్లు తీయడం ఇది నాలుగోసారి. విదేశీ గడ్డపై అయితే ఇదే మొదటిసారి.
ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో మంచి ఆరంభం లభించడం చాలా ముఖ్యం. కాబట్టి ఓపెనర్లు బాగా ఆడాల్సిన అవసరం ఉంది. వికెట్లు చేతిలో ఉన్నప్పుడు మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాల్సింది. కానీ విఫలమయ్యాం. 30వ ఓవర్ వరకు మంచి రన్‌రేటే ఉంది. అప్పట్నించే మ్యాచ్‌లో వేగం పెంచితే సరిపోయేది. మా గేమ్ ప్లాన్ ప్రకారం ఆడటంలో విఫలమవుతున్నాం. వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకున్నాం. రాయుడు అవుటైన తర్వాత బంతులను బాగా వృథా చేశాం.
మా బ్యాటింగ్ అసలు బాగా లేదు. చాలా విమర్శలున్నాయి. కానీ ఇదంతా మ్యాచ్‌లో భాగమని అనుకుంటున్నాం. అయితే ఇదే బ్యాటింగ్ లైనప్‌తో 2013 చాంపియన్స్ ట్రోఫీని గెలిచాం. బంతిని స్వింగ్ చేయగలడనే ఉద్దేశంతో బిన్నీని తీసుకున్నాం. తర్వాతి మ్యాచ్‌కు నాలుగైదు రోజుల విరామం ఉంది. ఆ లోపు చాలా విషయాలు పరిష్కరించుకోవాలి. నాలుగున్నర నెలలు కుటుంబానికి దూరంగా ఉండటం చాలా కష్టంతో కూడుకున్నది. ప్రపంచకప్‌కు ముందు లభించే సమయాన్ని మేం అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకుంటాం.
- ధోని (భారత కెప్టెన్)