
ఉత్కంఠ రేపుతున్న తొలి టెస్టు
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మంచి రసకందాయంలో పడింది. ఆడుతున్నది టెస్టు మ్యాచా.. టి-20నా అన్నట్లుగా ఉంది. ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని 290 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత జట్టు ముందు కేవలం 364 పరుగుల ఊరించే విజయలక్ష్యాన్ని ఉంచాడు. అడిలైడ్ పిచ్ మీద ఒక్కోరోజు 350 నుంచి 400 వరకు కూడా పరుగులు వస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లీ లాంటి విధ్వంసక బ్యాట్స్మన్ ఉండగా మైఖేల్ క్లార్క్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
తొలి రెండు రోజుల ఆట చూసినప్పుడు ఈ మ్యాచ్ దాదాపుగా డ్రా అవ్వాల్సిందేనన్న వాళ్లు ఇప్పుడు నరాలు బిగబట్టుకుని ఉత్కంఠగా టీవీలకు అతుక్కుపోయారు. తొలి రెండు వికెట్లను 60 పరుగుల లోపే కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయి ఆడుతోంది. ఒకవైపు ఓపెనర్ మురళీ విజయ్, మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ పోటా పోటీగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కాలి కండరాలు మరోసారి పట్టేశాయి. దాంతో హాడిన్స్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించేసి తాను మైదనాం వదలి వెళ్లిపోయాడు. మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడే క్లార్క్ రిడైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
ఇక తొలి టెస్టును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోడానికి భారత బ్యాట్స్మన్ ఏమాత్రం వెనకాడలేదు. మొదటి వికెట్ను 16 పరుగులకే కోల్పోయినా, రెండో వికెట్ 57 పరుగుల వద్ద పడినా మురళీ విజయ్, కోహ్లీ ఏమాత్రం మనో నిబ్బరం కోల్పోలేదు. ముళీ 85, కోహ్లీ 76 పరుగులతో చెలరేగిపోవడంతో టీమిండియా 59 .2 ఓవర్లలోనే 200 పరుగుల స్కోరును దాటేసింది. దాంతో మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగుతోంది. టీ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విజయానికి 159 పరుగుల దూరంలో నిలిచింది.