
టీమిండియా తొలిసారి..
మొహాలి:ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 271/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 417 పరుగుల వద్ద ఆలౌటై మ్యాచ్ పై పట్టు సాధించింది. కాగా, ఇదే క్రమంలో ఒక మైలురాయిని కూడా భారత క్రికెట్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు, అంతకంటే కిందవచ్చిన ఆటగాళ్లు మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఘనతను భారత్ తొలిసారి సొంతం చేసుకుంది.
ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవి చంద్రన్ అశ్విన్(72;113 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ దిగిన రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అర్థశతకం సాధించాడు. మరొకవైపు తన కెరీర్లో రెండో టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ (55;141 బంతుల్లో 4 ఫోర్లు) తొమ్మిదో స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ తరపున ఒక టెస్టులో ఇలా ముగ్గురు కిందస్థాయి ఆర్డర్ లో బ్యాటింగ్ కు వచ్చి హాఫ్ సెంచరీలు సాధించడం ఇదే మొదటిసారి.
రవీంద్ర జడేజా బెస్ట్ ఇదే
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆలౌ రౌండర్ రవీంద్ర జడేజా(90;170 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్స్) తృటిలో సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో జడేజా అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68 కాగా, వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 87.
ఈ రోజు ఆట మొదటి సెషన్లో అశ్విన్ వికెట్‌ను భారత్ కోల్పోయింది. అనంతరం రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.జయంత్ యాదవ్ తో కలిసి 80 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే సెంచరీకి 10 పరుగుల దూరంలో జడేజా అవుటయ్యాడు. కాగా, ఆ తరువాత ఉమేశ్ యాదవ్‌తో కలిసి జయంత్ యాదవ్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 33 పరుగులు జత చేసిన తరువాత జయంత్ తొమ్మిదో వికెట్ గా పెవిలియన్ చేరాడు. కాసేపటికి ఉమేశ్(12) కూడా అవుట్ కావడంతో భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ కు 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ ఐదు వికెట్లు, రషిద్ నాలుగు వికెట్లు సాధించారు.