5 సచిన్‌ రికార్డులను బద్దలు కొట్టలేరు..!! | Five Records Of Sachin Those Might Never Broken In Cricket | Sakshi
Sakshi News home page

5 సచిన్‌ రికార్డులను బద్దలు కొట్టలేరు..!!

Published Tue, Apr 24 2018 9:24 AM | Last Updated on Tue, Apr 24 2018 9:38 AM

Five Records Of Sachin Those Might Never Broken In Cricket - Sakshi

సచిన్‌ టెండుల్కర్‌ (పాత ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : క్రికెట్‌ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సోమవారం 45వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్‌ అరంగేట్రం చేశారు. కెరీర్‌ తొలినాళ్లలో ఒడిదుడుకులకు గురైన సచిన్‌.. మెల్లగా నిలదొక్కుకుని క్రికెట్‌లో డాన్‌ బ్రాడ్‌మన్‌ స్థాయికి చేరుకున్నారు.

ముంబై నుంచి మొదలైన సచిన్‌ ప్రస్థానం ఖండాలను దాటుతూ ఆయా దేశాల ప్రధానులు, రాజులు, అధ్యక్షులు మెచ్చుకునే వరకూ వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 25 సంవత్సరాల్లో సచిన్‌ అంటే ఓ బ్రాండ్‌ అనే స్థాయికి ఎదిగిపోయారు మాస్టర్‌ బ్లాస్టర్‌. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 100 సెంచరీలతో 34,357 పరుగులు సాధించారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి సచిన్‌ రిటైర్‌ అయ్యారు.

విరాట్‌ కోహ్లి రూపంలో భారత్‌కు ఆయనలాంటి మరో చక్కని బ్యాట్స్‌మన్‌ దొరికారు. అయితే, సచిన్‌ ఘన చరిత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. వన్డేల్లో సచిన్‌ రికార్డును అధిగమించే దిశగా ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ సాగుతున్న విషయం తెలిసిందే. 45 ఏళ్ల సచిన్‌కు చెందిన 5 రికార్డులు భవిష్యత్‌ బ్యాట్స్‌మన్స్‌కు అందనీ ద్రాక్షలే కావొచ్చు.

రికార్డులు...
200 టెస్టు మ్యాచ్‌లు : సచిన్‌ తన క్రికెట్‌ కెరీర్‌లో 200 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాళ్లు స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌లు 168 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించారు. ప్రస్తుతం అల్‌స్టెర్‌ కుక్‌ (154 టెస్టులు), జేమ్స్‌ అండర్సన్‌ (136 టెస్టులు)లు ఇంకా టెస్టు క్రికెట్‌లో కొనసాగుతున్నారు. అయితే, వీరు ఇరువురూ 30 ఏళ్లకు మించి వయసు పైబడిన వారే. 200 టెస్టులు ఆడి సచిన్‌ రికార్డును వీరు బ్రేక్‌ చేస్తారా? అన్నది అనుమానమే.

టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు : టెస్టు క్రికెట్‌లో ఇన్ని పరుగులు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్‌ మాత్రమే. ఇంగ్లండ్‌ జట్టు కెప్టెన్‌ అల్‌స్టెర్‌ కుక్‌ మాత్రమే 12,028 పరుగులతో సచిన్‌కు చేరువలో ఉన్నాడు. మిగతా బ్యాట్స్‌మన్లకు ఆ రికార్డు స్వప్నమే.

100 అంతర్జాతీయ సెంచరీలు : 2012లో 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా సచిన్‌ నిలిచాడు. ఆ రికార్డు నెలకొల్పిన ఆరేళ్ల తర్వాత విరాట్‌ కొహ్లీ 56 సెంచరీలు, హషీమ్‌ ఆమ్లా 54 సెంచరీలతో దీనిపై కన్నేశారు. అయితే, కొద్ది సంవత్సరాలుగా నిలకడగా ఆడుతూ వస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ ఈ రికార్డును కచ్చితంగా అధిగమిస్తారని నిపుణులు అంటున్నారు. అయితే, మరో 44 సెంచరీలను చేస్తే తప్ప కొహ్లీ ఈ ఫీట్‌ను సాధించలేరు.

18,426 వన్డే పరుగులు : సచిన్‌ నెలకొల్పిన ఈ రికార్డు కచ్చితంగా ఈతరం ఆటగాళ్లు బ్రేక్‌ చేస్తారని భావిస్తున్నారు. ఈ రికార్డుకు టాప్‌ కంటెడర్స్‌గా ఉన్న ప్రస్తుత ఆటగాళ్లు ఎంఎస్‌ ధోని (9,967 పరుగులు), కోహ్లి (9,588 పరుగులు), క్రిస్‌ గేల్‌ (9,585 పరుగులు), ఏబీ డివిలియర్స్‌ (9,577 పరుగులు). శ్రీలంక మాజీ క్రికెటర్‌ కుమార సంగక్కర 14, 234 పరుగులతో సచిన్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు.

96 అర్థ సెంచరీలు : తన వన్డే కెరీలో 463 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ 96 అర్థసెంచరీలు చేశారు. ఇది ఒక రికార్డు. సాధారణంగా అర్థ సెంచరీల రికార్డుపై ఎక్కువ దృష్టి ఉండదు. అయితే, ప్రస్తుత భారత కెప్టెన్‌ కోహ్లి ఇప్పటికే 46 అర్థ సెంచరీలను సాధించారు. మరో 50 అర్థ సెంచరీలు చేస్తే గానీ ఈ రికార్డును అధిగమించలేరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement