వెంగసర్కార్ గుడ్ బై
ముంబై:భారత మాజీ దిగ్గజ క్రికెటర్ దిలీప్ వెంగసర్కార్ ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. లోధా ప్యానల్ సిఫారుసులను కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ ఈనెల రెండో తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఎంసీఏ ఉపాధ్యక్ష పదవిని నుంచి వెంగసర్కార్ వైదొలిగారు.
ఈ విషయాన్ని తాజాగా ఎంసీఏకు లేఖ రూపంలో వెంగీ తెలియజేశారు. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి శరద్ పవార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్లకు పైబడిన వారు క్రికెట్ పరిపాలన వ్యవహారాలు చూసేందుకు దూరంగా ఉండాలంటే లోధా కమిటీ సూచించిన క్రమంలో పవార్ ఆ పదవిని గతేడాది డిసెంబర్ 17వ తేదీన వదులుకున్నారు.
గతంలో ముంబై వైస్ ప్రెసిడెంట్గా దిలీప్ వెంగసర్కార్ రెండు సార్లు సేవలందించారు. 2002 నుంచి 2010 మధ్యకాలంలో వెంగసర్కార్క్ ఎంసీఏ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. దాంతో ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిని వెంగసర్కార్ వదులుకోవాల్సి వచ్చింది. క్రికెట్ సమూల ప్రక్షాళనకు ఉద్దేశించిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీసీసీఐలో, దాని అనుబంధ యూనిట్లలోని బాధ్యులు, అధికారులకు వయస్సు పరిమితి, కాలపరిమితి ఉండాలని లోధా కమిటీ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ సిఫారులకు సుప్రీంకోర్టు ఆమోద ముద్రవేయడంతో వెంగసర్కార్ తన పదవికి రాజీనామా చేశారు.