
బాబ్ హెవిట్‌కు ఆరేళ్ల జైలు
- రేప్ కేసులో కోర్టు తీర్పు
ప్రిటోరియా: కెరీర్‌లో 15 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన టెన్నిస్ దిగ్గజం బాబ్ హెవిట్ (75)కు రేప్ కేసులో ఆరేళ్ల జైలు శిక్ష పడింది. 1980-1990 మధ్య కాలంలో తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు మైనర్ అమ్మాయిలపై హెవిట్ అత్యాచారం జరిపినట్లు వచ్చిన ఆరోపణను నిర్ధారిస్తూ దక్షిణాఫ్రికా కోర్టు సోమవారం ఈ తీర్పు చెప్పింది. ఆస్ట్రేలియాకు చెందిన హెవిట్, ఆరంభంలో స్వదేశం తరఫున ఆడినా... 1967లో దక్షిణాఫ్రికా వలస వెళ్లారు.
మొత్తం 9 గ్రాండ్‌స్లామ్ డబుల్స్, 6 గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన హెవిట్, దక్షిణాఫ్రికా ఏకైక డేవిస్ కప్ (1974) విజయంలో కూడా సభ్యుడు. 1992లో టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు చోటు దక్కింది. అయితే రేప్ ఆరోపణల అనంతరం 2012లో ఆయన పేరును తప్పించారు. వృద్ధాప్యంలో తన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శిక్షనుంచి తప్పించాలని హెవిట్‌తోపాటు ఆయన భార్య చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. అయితే తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని కల్పించింది.