ఈగిల్స్‌కు ఫ్రెంచ్ ‘కిక్’
ప్రత్యర్థిని 70 నిమిషాల పాటు వణికించిన జట్టు... గోడలా నిలబడి దాడులను అడ్డుకున్న డిఫెండర్లు... బంతిపై ఇంత పట్టు సాధించారా అని ఆశ్చర్యపరచిన ఆటగాళ్లు... ఆఖరి 20 నిమిషాల్లో చేతులెత్తేశారు. ఆఫ్రికా ఆశలను మోస్తున్న నైజీరియా చివర్లో చతికిలపడింది. తొలుత సాధారణంగా ఆడిన ఫ్రాన్స్.. మ్యాచ్ చివరి దశలో చెలరేగి ఈగిల్స్‌ను ఇంటికి పంపించింది. 21 ఏళ్ల యువ పోగ్బా అద్భుతమైన హెడర్‌తో ఫ్రెంచ్ తడాఖా రుచి చూపించాడు.
- క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్
- నైజీరియాకు నిరాశ
బ్రెజీలియా: మాజీ చాంపియన్ ఫ్రాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే రాణించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. సోమవారం రాత్రి నైజీరియాతో జరిగిన ప్రి క్వార్టర్ ఫైనల్లో 2-0తో నెగ్గింది. ద్వితీయార్ధం చివర్లో ఫ్రాన్స్ తమ అసలైన ఆటతీరును ప్రదర్శించింది. పదే పదే ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులకి దిగి ఫలితం రాబట్టింది. నైజీరియా గోల్ కీపర్ ఎన్యీమా చాలా వాటిని సమర్థవంతంగానే అడ్డుకున్నా... 79వ నిమిషంలో యువ సంచలనం పోగ్బా హెడర్ గోల్ ముందు చేష్టలుడిగి పోవాల్సి వచ్చింది. ఇంజ్యూరీ సమయంలో యోబో (నైజీరియా) సెల్ఫ్ గోల్ చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పోగ్బాకి దక్కింది.
- మ్యాచ్ ఆరంభంలో నైజీరియా చురుగ్గా కదిలింది. 19వ నిమిషంలో నైజీరియా స్ట్రయికర్ ఎమెనికే గోల్ చేసినా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు.
- 22వ నిమిషంలో ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ వల్బుయేన ఇచ్చిన క్రాస్ షాట్‌ను యువ స్ట్రయికర్ పాల్ పోగ్బా సూపర్ వాలీతో గోల్ ప్రయత్నం చేసినా నైజీరియా కీపర్ ఎన్యీమా దాన్ని వమ్ము చేశాడు.
- 30వ నిమిషంలో ఒడెమ్‌వింగీ ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియా వైపు తీసుకెళుతున్న బంతిని డిఫెండర్ వరానే తప్పించి నైజీరియా గోల్ అవకాశాన్ని దెబ్బతీశాడు.
- 40వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని ఫ్రాన్స్ జారవిడుచుకుంది. వల్బుయేనా పాస్‌ను సరిగ్గా అంచనా వేయకుండా డిఫెండర్ డెబుచీ బంతిని వైడ్‌గా పంపాడు.
- అటు 44వ నిమిషంలోనూ నైజీరియా ఆటగాడు ఎమినెకే ఫ్రాన్స్ పెనాల్టీ ఏరియా వైపు దూసుకొచ్చాడు. గోల్ పోస్టు దగ్గరిదాకా వెళ్లే అవకాశం లేకపోవడంతో దూరం నుంచే ఆడిన షాట్‌ను ఫ్రాన్స్ కీపర్ లోరిస్ ఒడిసిపట్టుకున్నాడు.
- పథమార్ధంలో 53 శాతం బంతి నైజీరియా ఆధిపత్యంలో ఉండడంతో పాటు నాలుగు సార్లు గోల్ పోస్టుపై దాడికి దిగారు. అయినా ఖాతా తెరువలేకపోయారు. దీంతో గోల్స్ లేకుండా విరామానికి వెళ్లారు.
- ద్వితీయార్ధం 54వ నిమిషంలో నైజీరియా మిడ్‌ఫీల్డర్ ఒనజిని మొరటుగా అడ్డుకున్నందుకు ఫ్రాన్స్ స్టార్ మిడ్‌ఫీల్డర్ మటౌడీ ఎల్లో కార్డుకు గురయ్యాడు.
- 64వ నిమిషంలో ఒడెమ్‌వింగీ గోల్ ప్రయత్నాన్ని ఫ్రాన్స్ కీపర్ విఫలం చేశాడు.
- 69వ నిమిషంలో ఫ్రాన్స్ గోల్ అవకాశాన్ని వెంట్రుకవాసిలో నైజీరియా ఆటగాడు మోసెస్ తప్పించాడు గోల్ పోస్టుకు ముందే బెంజెమా కొట్టిన షాట్ నేరుగా లోనికి వెళ్లబోతుండగా మోసెస్ చురుగ్గా ముందుకు కదిలి బంతి లైన్ దాటకముందే కాలితో బయటికి తన్నాడు.
- 78వ నిమిషంలో బెంజెమా హెడర్ విఫలమైంది. అయితే మరో నిమిషం (79వ)లోనే ఫ్రాన్స్ సంబరాలు చేసుకుంది. వల్బుయేనా కార్నర్‌ను గాల్లోకి ఎగిరి అందుకున్న పోగ్బా హెడర్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ సమయంలో నైజీరియా గోల్ కీపర్ మరీ ముందుకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు.
- - 84వ నిమిషంలో ఫ్రాన్స్ మరో ప్రయత్నాన్ని నైజీరియా గోల్ కీపర్ గాల్లోకి ఎగిరి అడ్డుకున్నాడు.
- అయితే ఇంజ్యూరీ సమయంలో నైజీరియా ఆటగాడు యోబో సెల్ఫ్ గోల్ చేసి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.
తమ జట్టు విజయాన్ని స్వదేశంలో ఆస్వాదిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ''ఫ్రాంకోయిస్ హాలెండె''