సానియా జంటకు షాక్
తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ lబోపన్న, పేస్ జోడీలు ముందంజ
పారిస్: కొత్త భాగస్వామి యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్)తో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఇండో–కజక్ ద్వయం అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)–అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా) జంటతో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా–ష్వెదోవా జంట 6–7 (5/7), 6–1, 2–6తో ఓటమి పాలైంది.
2 గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జోడీ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న తమ వేర్వేరు భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో పేస్–స్కాట్ లిప్‌స్కీ (అమెరికా) జంట 7–6 (7/5), 4–6, 6–2తో హైయోన్ చుంగ్ (దక్షిణ కొరియా)–అల్బోట్ (మాల్డోవా) ద్వయంపై గెలిచింది. తొమ్మిదో సీడ్ రోహన్ బోపన్న–క్యువాస్ (ఉరుగ్వే) జోడీ 6–1, 6–1తో మథియాస్ బుర్‌గ్యూ–పాల్ హెన్రీ మథియు (ఫ్రాన్స్) జంటపై విజయం సాధించింది.