
ఇంగ్లండ్ మాయ చేసేనా!
ఓవైపు పదేళ్ల కిందటి మ్యాజిక్‌ను మరోసారి పునరావృతం చేయాలని ఇంగ్లండ్...
నేటి నుంచి ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
బర్మింగ్‌హామ్: ఓవైపు పదేళ్ల కిందటి మ్యాజిక్‌ను మరోసారి పునరావృతం చేయాలని ఇంగ్లండ్... మరోవైపు సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించాలని ఆస్ట్రేలియా... ఈ నేపథ్యంలో నేటి (బుధవారం) నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న యాషెస్ మూడో టెస్టులో ఇరుజట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. 2005 యాషెస్‌లో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో ఇంగ్లండ్ 2 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ప్రస్తుత యాషెస్‌లో కూడా ఆతిథ్య జట్టు కార్డిఫ్‌లో గెలిచి లార్డ్స్‌లో ఓడటంతో సిరీస్ 1-1తో సమమైంది.
దీంతో ఇప్పుడు ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్‌హామ్) మ్యాచ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టింది. దీనికోసం కెప్టెన్ కుక్, కోచ్ బేలిస్ స్పష్టమైన ప్రణాళికలు రచిస్తున్నారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం ద్వారా భారీ స్కోరు చేయాలని భావిస్తున్నారు. బౌలింగ్‌లో బ్రాడ్ వికెట్లు తీస్తున్నా.. అండర్సన్, వుడ్, స్టోక్స్‌ల నుంచి సరైన స్పందన లేదు. స్పిన్‌లో మొయిన్ అలీ ప్రభావం చూపలేకపోతున్నాడు. మరోవైపు లార్డ్స్‌లో అద్భుత విజయం సాధించిన ఆసీస్ మంచి ఆత్మ విశ్వాసంతో కనబడుతోంది. తుది జట్టులో మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.