‘దంగల్’ హంగామా...
నేటి నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్–2
అందరి దృష్టి సాక్షి, ఫోగట్ సిస్టర్స్ పైనే బరిలో ఆరు జట్లు
తొలి రోజు హరియాణా, ముంబై పోరు
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించిన సాక్షి మలిక్‌తో పాటు ‘ఫోగట్ సిస్టర్స్’ జీవితాలను ప్రతిబింబిస్తూ ఇటీవల విడుదలై దుమ్మురేపుతున్న ‘దంగల్’ చిత్రంతో ఇప్పుడు రెజ్లింగ్ అంటే సర్వత్రా ఆసక్తి రెట్టింపయ్యింది. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో దేశంలోని క్రీడాభిమానులను అలరించేందుకు నేటి (సోమవారం) నుంచి ప్రొ రెజ్లింగ్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం కానుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మద్దతుతో 18 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌కు స్థానిక కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియం వేదిక కానుంది. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి.
తొలి మ్యాచ్ గతేడాది చాంపియన్‌గా నిలిచిన ముంబై మహారథి, రన్నరప్ హరియాణా హ్యామర్స్ మధ్య జరుగనుంది. ఇక ఈ లీగ్‌కు బజరంగ్ పూనియా, అమిత్ కుమార్, జితేంద్ర, సందీప్ తోమర్, సాక్షి, గీతా ఫోగట్, బబితా కుమారిలే కాకుండా ప్రపంచ చాంపియన్లు, ఒలింపిక్ పతకాలు సాధించిన అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు స్టార్ అట్రాక్షన్‌గా మారనున్నారు. అయితే సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ లీగ్‌కు దూరంగా ఉండటం అభిమానులకు కాస్త నిరాశే. రూ.15 కోట్ల ప్రైజ్‌మనీతో తొలి సీజన్‌కు మించి భారీగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.
ఇవీ జట్లు...
ప్రొ రెజ్లింగ్ లీగ్–2లో ముంబై మహారథి, హరియాణా హ్యామర్స్, ఢిల్లీ సుల్తాన్స్, జైపూర్ నింజా, యూపీ దంగల్, ఎన్‌సీఆర్ పంజాబ్ రాయల్స్ పాల్గొంటున్నాయి. ప్రతీ జట్టులో తొమ్మిది మంది రెజ్లర్లుంటారు. ఇందులో భారత్‌కు చెందిన పురుష రెజ్లర్లు ముగ్గురు, మహిళా రెజ్లర్లు ఇద్దరు ఉంటారు. అలాగే విదేశీ కోటా కింద ఇద్దరేసి పురుషుల, మహిళల రెజ్లర్లు ఉంటారు. ఓవరాల్‌గా మొత్తం 54 మంది పాల్గొంటున్నారు.
లీగ్ ఫార్మాట్...
లీగ్ దశలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఈనెల 17, 18న సెమీఫైనల్స్ ఉంటాయి. 19న జరిగే తుదిపోరులో నెగ్గిన విజేత రెండో సీజన్‌లో చాంపియన్‌గా అవతరిస్తుంది. ఇక పోటీలు తొమ్మిది విభాగాల్లో జరుగుతాయి. పురుషుల విభాగంలో 57 కేజీలు, 65 కేజీలు, 70 కేజీలు, 74 కేజీలు, 97 కేజీల్లో నిర్వహిస్తుండగా... మహిళా రెజ్లర్లు 48 కేజీలు, 53 కేజీలు, 58 కేజీలు, 69–75 కేజీలలో సత్తా చూపనున్నారు.
సూపర్ బౌట్..
ఈ లీగ్‌లో ఈనెల 15న మహిళల 58 కేజీల విభాగంలో జరిగే బౌట్ అత్యంత ఆసక్తి రేపనుంది. ఎందుకంటే ఈ బౌట్... రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (ఢిల్లీ సుల్తాన్స్)... ‘దంగల్’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ గీత ఫోగట్ (యూపీ దంగల్) మధ్య జరుగనుంది. అయితే వీరిద్దరిపై విపరీతమైన ఒత్తిడి, అంచనాలు ఉండడంతో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ప్రొ రెజ్లింగ్‌లో నేడు
ముంబై మహారథి గీ హరియాణా హ్యామర్స్
రాత్రి 7 గంటల నుంచి సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం