
లయన్స్ పై లిన్ వీరవిహారం
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్రిస్ లిన్ వీరవిహారం చేశాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. గుజరాత్ బౌలర్లపై ఆది నుంచి విరుచుకుపడ్డ లిన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
తొలి ఓవర్ ఆఖరి బంతిని ఫోర్ కొట్టిన లిన్..ఆ తరువాత రెండో ఓవర్ రెండు, మూడు బంతుల్ని సిక్సర్, ఫోర్లగా మలిచి తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. ఆ తరువాత కూడా లిన్ రెచ్చిపోయి ఆడటంతో గుజరాత్ బౌలర్లకు నిరాశే మిగిలింది.అతనికి జతగా కోల్ కతా కెప్టెన్ గౌతం గంభీర్ కూడా హాఫ్ సెంచరీ చేయడంతో కోల్ కతా జట్టు 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.