2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్ 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు... 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ 122 బంతుల్లో 9 ఫోర్లతో 97 పరుగులు... నాలుగేళ్ల వ్యవధిలో భారత జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలిచిన సందర్భాల్లో గౌతం గంభీర్ పోషించిన పాత్ర క్రికెట్ అభిమానులు మరచిపోలేనిది. ఈ రెండు టోర్నీల తుది పోరులో అతనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. గావస్కర్ తర్వాత భారత అత్యుత్తమ ఓపెనర్ గంభీరే అంటూ సహచరుడు సెహ్వాగ్ నుంచి ప్రశంసలు అందుకున్న గౌతీ మూడు ఫార్మాట్‌లలో కూడా ఓపెనర్‌గా రాణించడం విశేషం. టీమిండియా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాల్లో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2009లో భారత్ టెస్టుల్లో తొలిసారి నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు, 2008లో ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ సీబీ వన్డే సిరీస్ గెలిచినప్పుడు గంభీర్ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. మైదానంలో ఎక్కడా వెనక్కి తగ్గని అతని దూకుడైన శైలి కూడా క్రికెట్ ప్రపంచానికి చిరపరిచితం.
రిటైర్మెంట్ ప్రకటించబోతూ...
2007లో వెస్టిండీస్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో గంభీర్‌కు చోటు దక్కలేదు. అప్పటికి అతని కెరీర్ ప్రారంభమై నాలుగేళ్లయింది. దాంతో ‘ఇక నేను క్రికెట్ ఆడదల్చుకోలేదు. ప్రాక్టీస్ కూడా చేయను. నాలో స్ఫూర్తి నింపలేకపోతున్నాను’ అని బహిరంగంగా ప్రకటించాడు. అయితే ప్రపంచకప్‌లో జట్టు ఘోర వైఫల్యం తర్వాత బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో అతడిని ఎంపిక చేశారు. ఇందులో ఒక సెంచరీతో మళ్లీ స్థానం పటిష్టం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే టి20 ప్రపంచకప్ వచ్చింది. అంతే... ఆ విజయం తర్వాత గంభీర్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. వరుసగా ఐదేళ్ల పాటు భారత క్రికెట్‌పై అతని ముద్ర కనిపించింది. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శించకపోయినా, సాహసాలకు ప్రయత్నించకుండా కూడా చక్కటి స్ట్రయిక్‌రేట్‌తో చకచకా పరుగులు సాధించే ప్రత్యేక శైలి గంభీర్‌ది. ముఖ్యంగా బ్యాక్‌ఫుట్‌పై స్పిన్‌ను ఎదుర్కోవడంలో గంభీర్ అద్భుతం. 2003లోనే వన్డేల్లో అరంగేట్రం చేసినా తొలి సిరీస్‌లో వైఫల్యంతో జట్టులో చోటు పోయింది. రెండేళ్ల తర్వాత టీమ్‌లోకి వచ్చిన అతను సెంచరీతో స్థానం పటిష్టపర్చుకున్నాడు. మధ్యలో ఓపెనింగ్ నుంచి తప్పించడంతో కొంత నిరాశ చెందినా... తన వ్యక్తి గత వ్యవహార శైలే అందుకు కారణమని గుర్తించి మారే ప్రయత్నం చేయడం విశేషం. 2009లో గంభీర్‌కు ‘అర్జున అవార్డు’ దక్కింది.
టెస్టుల్లో జోరు...
ఆరంభంలో ఒడిదుడుకులకు లోనైన గంభీర్ టెస్టు కెరీర్ పునరాగమనం తర్వాత ఊపందుకుంది. ముఖ్యంగా 2008 జూలై నుంచి 2010 జనవరి మధ్య కాలంలో అతని ఆట శిఖరానికి చేరింది. ఒక దశలో ఆడిన 13 టెస్టుల్లో అతను ఏకంగా ఎనిమిది సెంచరీలు బాదాడు. వీటిలో సొంతగడ్డ ఢిల్లీలో ఆస్ట్రేలియాపై సాధించిన డబుల్ సెంచరీ కూడా ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత గంభీర్ ప్రభ మసకబారింది. ముఖ్యంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో కలిపి భారత్ ఘోరంగా 0–8తో చిత్తయిన టెస్టుల్లో గంభీర్ వైఫల్యం కూడా ఉంది. వీటిల్లో 14 ఇన్నింగ్స్‌లలో అతను ఒకే ఒక అర్ధసెంచరీ సాధించాడు. అనంతరం సొంతగడ్డపై కూడా ప్రభావం చూపలేకపోవడంతో జట్టులో చోటు పోయింది. ఒకానొక సమయంలో టెస్టు కెప్టెన్‌గా కూడా పేరు వినిపించినా ఆ తర్వాత తన స్థానం కాపాడుకోవడమే కష్టంగా మారింది. విజయ్, ధావన్ ఓపెనర్లుగా నిలదొక్కుకున్న తర్వాత గంభీర్ జట్టుకు దాదాపుగా దూరమయ్యాడు. 2014లో ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌కు మళ్లీ పిలుపు వచ్చినా 4, 18, 0, 3 స్కోర్లతో ఆ అవకాశం వృథా అయింది. రెండేళ్లకు మరోసారి అవకాశం తలుపు తట్టినా దానిని కూడా గంభీర్ ఉపయోగించుకోలేకపోయాడు.
రాజకీయాలపై ఆసక్తితోనే...
చాలా కాలంగా గంభీర్ రాజకీయపరమైన అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నాడు. ముఖ్యంగా సైనికులు, వారి సంక్షేమం వంటి అంశాల్లో అతను ఏదో రూపంలో భాగస్వామిగా ఉంటున్నాడు. గంభీర్‌కు రాజకీయాలపై ఆసక్తి ఉందని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సీటును ఆశిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మరోసారి అతను విమర్శలు చేశాడు. ఆటపరంగా చూస్తే ఐపీఎల్‌లో ఢిల్లీ కూడా అతడిని విడుదల చేసింది. 2019 కోసం మళ్లీ ఏదైనా ఫ్రాంచైజీ గంభీర్‌ను ఎంచుకునే అవకాశాలు దాదాపుగా లేవు. వ్యాఖ్యాతగా కూడా పని చేస్తున్న గంభీర్... దాని కోసం గాయం సాకుతో ఢిల్లీ రంజీ మ్యాచ్‌కు దూరంగా ఉండటం కూడా విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌తో అన్నింటికి ఫుల్‌స్టాప్ పెట్టేయాలని భావించడమే అతని ప్రకటనకు కారణం.
అదే అత్యుత్తమం
2009లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ అతని టెస్టు కెరీర్‌లో అతి పెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. తను కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 10 గంటల 43 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 137 పరుగులు చేసిన గంభీర్ మ్యాచ్‌ను కాపాడాడు. ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి టెస్టును కూడా ‘డ్రా’ చేసుకున్న భారత్... తొలి మ్యాచ్‌లో సాధించిన గెలుపుతో అరుదైన సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
–సాక్షి క్రీడా విభాగం
►2009లో ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
►వరుసగా 11 టెస్టుల్లో కనీసం ఒక అర్ధ సెంచరీ అయినా సాధించిన ఘనతతో గంభీర్... వివియన్ రిచర్డ్స్‌తో సమంగా నిలిచాడు.
►వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు సాధించిన క్రికెటర్. మరో మ్యాచ్‌లో శతకం చేస్తే (68 ఔట్) బ్రాడ్‌మన్‌తో సమంగా నిలిచేవాడు.
సొంతగy
► 2010లో న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌కు, ఆ తర్వాత ఒక సారి విండీస్‌తో వన్డేకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ నాయకత్వంలో భారత్ ఆరు మ్యాచ్‌లు కూడా గెలిచింది.
ఐపీఎల్ కెప్టెన్‌గా...
ఐపీఎల్ ఆరంభంలో గంభీర్ సొంత జట్టు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడాడు. అయితే ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మారిన తర్వాత తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 2012, 2014లలో జట్టును విజేతగా నిలిపాడు. ఈ సీజన్‌లో కోల్‌కతా అతడిని తప్పించిన తర్వాత ఢిల్లీ ఎంచుకుంది. అయితే బ్యాటింగ్‌లో రాణించలేక కెప్టెన్సీ నుంచి స్వయంగా తప్పుకున్న గంభీర్‌కు మళ్లీ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దాంతో తన ఫీజును కూడా తీసుకోనని ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment