
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ప్రపంచకప్ 2019కు సమయం ఆసన్నమైంది. మే 30 నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ మహా సంగ్రామం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్లు తమ బలాబలాలను పరీక్షించుకునే పనిలో ఉన్నాయి. ఇంగ్లండ్, వేల్స్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాపై భారీ అంచనాలే ఉన్నాయి. టైటిల్ వేటలో పాల్గొనే టీమిండియా ఆటగాళ్లు ఎవరనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొంత మేరకు అవగాహనకు వచ్చినా ఆటగాళ్ల ఫామ్, గాయాల కారణంగా ప్రపంచకప్ ఆరంభం వరకు ఎవరు జట్టులో ఉంటారనేది చెప్పడం కష్టంగా మారింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2019లో పాల్గొనే భారత జట్టుని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు.
అశ్విన్‌కు అవకాశం.. పంత్‌కు నో ఛాన్స్
మొత్తం 15 మందితో కూడిన తన కలల జట్టులో యువ ఆటగాడు రిషభ్ పంత్‌కు గంభీర్ అవకాశమివ్వలేదు. అంతేకాకుండా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా దూరమైన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు జట్టులో చోటు కల్పించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు జట్టులో అవకాశమిచ్చాడు. ఓపెనర్లుగా శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కొనసాగాలని, మూడో స్థానంలో రాహుల్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి వస్తే బాగుంటుందని సూచించాడు. ఇక సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని తప్పకుండా ప్రపంచ కప్‌లో ఆడాలని.. అతడు టీమిండియాకు అదనపు బలమని వివరించాడు. ఇక రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, ఉమేశ్ యాదవ్, పృథ్వీ షాలు గంభీర్ కలల జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు.
గంభీర్ ప్రకటించిన జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్థిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, చహల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్
Comments
Please login to add a commentAdd a comment